ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను తీసుకురానుంది. దీనికోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ‘భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025’’లో టీవీఎస్ తన ఫస్ట్ సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. జుపిటర్ 125 సీఎన్‌జీ (Jupiter 125 CNG) పేరిట దీన్ని పరిచయం చేసింది. సందర్శన సందర్భంగా స్కూటర్‌లోని కొన్ని ఫీచర్లను రివీల్ చేసింది. ఆ వివరాలు ఇవే.టీవీఎస్ జుపిటర్ 125 సీఎన్‌జీలో 124.8-cc, సింగిల్ సిలిండర్, ఎయిర్- కూల్డ్ బై- ఫ్యూయల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.2 హార్స్ పవర్, 9.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటెడ్ గేర్‌బాక్స్‌తో ఈ స్కూటర్‌ను తీసుకురానుంది. టాప్ స్పీడ్ గంటకు 80.5 కిలోమీటర్లు. రెండు ఇంధన సదుపాయాలతో తీసుకొస్తున్న ఈ స్కూటర్‌లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 1.4 కిలోల సామర్థ్యం గల సీఎన్‌జీ సిలిండర్ ఉంటాయి. స్కూటర్ ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉంటుంది. ఇక సీఎన్‌జీ నాజిల్ సీటు వద్ద ఉంటుంది.
సీఎన్‌జీ, పెట్రోల్ కంబైండ్ రేంజ్ 226 కిలోమీటర్లు ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది. మెటల్ మాక్స్ బాడీతో జూపిటర్ 125 సీఎన్‌జీని తీసుకురానున్నారు. ఎల్ఈడీ హెచ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్-ఇన్-వన్ లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్-ఇంజెక్షన్, ఇంటెలిగో టెక్నాలజీతో వస్తోంది. టీవీఎస్ జూపిటర్‌తో పాటు ఇథనాల్‌తో నడిచే రైడర్ 125 ను ఆవిష్కరించింది. ఐక్యూబ్ విజన్ కాన్సెప్ట్ స్కూటీ, అపాచీ ఆర్‌టీఎస్ఎక్స్‌ను ఆవిష్కరించింది.