మీరు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా. అయితే మీకు అలర్ట్. మార్కెట్లోకి మరో 4 కొత్త స్కీమ్స్ వచ్చేశాయ్. ఇందులో వైట్‌వోక్ క్యాపిటల్, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక్కొక్కటి ఉండగా.. గ్రో మ్యూచువల్ ఫండ్ రెండు స్కీమ్స్ తీసుకొచ్చింది. వైట్‌వోక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా వైట్‌వోక్ క్యాపిటల్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ అనే స్కీమ్ తెచ్చింది. దీని ప్రధాన వ్యూహం నాణ్యమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టి.. లాభాలు ఆర్జించడం. ఈ ఎన్ఎఫ్ఓ ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంది. కనీసం రూ. 500 పెట్టుబడితో చేరొచ్చు. ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ ప్రకారం.. మదుపరుల ముందుకు వచ్చిన మొదటి మ్యూచువల్ ఫండ్ ఇదే. ఇక్కడ బీఎస్ఈ క్వాలిటీ టీఆర్ఐ సూచీ ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంటుంది. రమేశ్ మంత్రి, తృప్తి అగర్వాల్, పీయూష్ బరన్వాల్, ధీరేశ్ పాథక్ .. ఫండ్ మేనేజర్లుగా ఉన్నారు.
>> ఇక మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ ఒక స్మాల్ క్యాప్ స్కీమ్ తెచ్చింది. ఇదే మిరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఎన్ఎఫ్ఓ జనవరి 24 వరకు అందుబాటులో ఉంది. ఇక్కడ కనీసం రూ. 5000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ స్కీమ్ కింద సమీకరించిన నిధుల్లో 65 శాతం వరకు స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడతారు. మిగతా సొమ్మును మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ తరగతికి చెందిన షేర్లకు కేటాయిస్తారు.
అయితే స్మాల్ క్యాప్ ఫండ్లలో సహజంగానే నష్టభయం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అదే సమయంలో లాభాలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. అందుకే.. ఎక్కువ రిస్క్ భరించేందుకు సిద్ధపడే ఇన్వెస్టర్లు.. ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. వరుణ్ గోయల్ ఈ ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు.
>> ఇక గ్రో మ్యూచువల్ ఫండ్.. రెండు కొత్త స్కీమ్స్ ఆవిష్కరించింది. దీంట్లో ఒకటి రైల్వేస్ PSU ETF పథకం కాగా.. మరొకటి రైల్వేస్ PSU ఇండెక్స్ ఫండ్. ఈ రెండూ ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. కనీసం రూ. 500 తో చేరొచ్చు. రైల్వే విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించటమే వీటి లక్ష్యం. ఇక్కడ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నిఫ్టీ ఇండియా రైల్వేస్ PSU ఇండెక్స్‌ను పోలి ఉంటాయి.
ఇటీవల రైల్వేల ఆధునికీకరణ, విస్తరణపై కేంద్రం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కువ లాభాలు, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. దీర్ఘకాలంలో ఈ కంపెనీలపై పెట్టుబడి పెట్టి మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది.