ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని గోకరాజుపల్లిలో నిర్వహించారు. తానా ఆధ్వర్యంలో రైతులకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ కవర్లను పంపిణీ చేశారు. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డోనర్లుగా పంచుమర్తి బ్రదర్స్, సంగమేశ్వరరావు పంచుమర్తి, మురళీ కృష్ణ పంచుమర్తి, నాగమల్లేశ్వర రావు పంచుమర్తి వ్యవహరించారు.ఈ సందర్భంగా నాగ పంచుమర్తి మాట్లాడుతూ.. రైతు బిడ్డగా జన్మభూమిపై మమకారంతో ఇక్కడి వాళ్ళకు ఏదైనా చేయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అలాగే ఎన్టీఆర్ అభిమానిగా ఆయన వర్థంతి రోజున ఆయనకు నివాళులు అర్పిస్తూ, తానా నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి తానా కార్యదర్శి రాజా కసుకుర్తి, తానా రైతుకోసం కో ఆర్డినేటర్ రమణ అన్నె, ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి సహకరించారు. రాజా కసుకుర్తి గోకరాజుపల్లికి తనవంతుగా సహాయపడటంతోపాటు నిధులను సమకూర్చి ఈ రైతు పరికరాల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూశారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన నాగ పంచుమర్తి తండ్రి రామకోటేశ్వరరావు కృషిని ఈ సందర్భంగా రాజా కసుకుర్తి ప్రశంసించారు. కాగా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ నాగ పంచుమర్తి ధన్యవాదాలు తెలియజేశారు.