ఆంధ్రప్రదేశ్ తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా స్వచ్ఛత కోసం ఒక రోజును కేటాయించలేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రతి నెలా మూడో శనివారం "స్వచ్ఛతా డివస్"గా పాటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మైదుకూరులో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించిన విషయాన్ని పట్టాభి గుర్తు చేశారు. స్వచ్ఛత కోసం సీఎం చంద్రబాబు సభలో అందరి చేత ప్రమాణం చేయించారని చెప్పారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 4.74 లక్షల మంది స్వచ్ఛత కోసం ప్రమాణం చేశారని పట్టాభి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రామాన్ని శనివారం నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. బస్‌స్టాప్, బస్ స్టేషన్లలో సహా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఏపీలో ఇంకా 46 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలిగించాల్సి ఉందని పట్టాభి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 2 వరకూ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త తొలగించనున్నట్లు చెప్పారు. దీని కోసం త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్స్ ద్వారా ప్రతి ఊరిలోనూ చెత్త ఉన్న ప్రాంతాలను గుర్తించనున్నట్లు పట్టాభి వెల్లడించారు. ఇకపై ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఏడాదికి 12 అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.