ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు క్షమాభిక్ష కల్పించారు. ఏకంగా పదిహేను వందల మందిపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఓటమిని తట్టుకోలేక 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. వేలాది మంది క్యాపిటల్ బిల్డింగ్ లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు.ఈ ఘటనపై ఫెడరల్ పోలీసులు దాదాపు పదిహేను వందల మందిపై కేసులు నమోదు చేశారు. వారంతా ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి కేసులను మాఫీ చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. తాజాగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశాక అధ్యక్ష హోదాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రంప్ మద్దతుదారులకు ఊరట లభించింది.