ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన నిందితుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ క్రమంలో మమత ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే మమత ప్రభుత్వం తీరును ఆర్జీ కర్ మృతురాలి తండ్రి తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందరపాటుతో వ్యవహరించవద్దని సూచించారు.రేపు తీర్పు కాపీ వస్తుందని, దానిని పరిశీలించాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు సరికాదన్నారు. ఆమె ఎన్నో మాటలు చెప్పి... సాక్ష్యాలను తారుమారు చేశారన్నారు. తారుమారు చేసిన వారిలో పోలీస్ కమిషనర్, ఇతరుల ప్రమేయం ఉందన్నారు. ఇవన్నీ మమతా బెనర్జీ చూడలేదా? అని ప్రశ్నించారు. అయితే సీబీఐ సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితుడికి జీవితఖైదు పడినట్లుగా అభిప్రాయపడ్డారు.