దేశంలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్ కి కోల్ కతా సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. అతడు మరణించేవరకు జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు పలు వర్గాలకు అసంతృప్తి కలిగించింది. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధిస్తారని ఆశించిన ఆయా వర్గాలకు నిన్నటి కోర్టు తీర్పు నిరాశ కలిగించింది. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఈ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీల్దా కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ పిటిషన్ వేయనున్నారు. ఆర్జీ కర్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వం వాదించనుంది. కాగా, నిన్న సీల్దా కోర్టు తీర్పుపై సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోషికి జీవితఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మమతా... ఈ కేసును పోలీసులు విచారించి ఉంటే నిందితుడికి మరణశిక్ష పడేదని, సీబీఐ సరిగా వాదించలేదని విమర్శించారు.