మంత్రి నారా లోకేశ్‌ను ఏపీ ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి శనివారం కోరిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్న వారి జాబితా మరింత పెరిగింది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్ రఫీ, ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేశ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులేనని యువగళం పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని టీడీపీ నేతలు అన్నారు. అయితే లోకేష్‌ను డిప్యూటి సీఎం చేయాలని పార్టీనేతలు చేస్తున్న ప్రచారానికి టీడీపీ హైకమాండ్ పుల్‌స్టాప్ పెట్టింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైన కూటమి పక్షాల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాలంటూ కొంతమంది మాట్లాడటంపై కూడా టీడీపీ హైకమాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ అధికార ప్రతినిధులకు సోమవారం ఫోన్లు చేసి మరీ స్పష్టం చేసింది. గత మూడు రోజుల నుంచి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా విజ్ఞాపనలు చేస్తుండటంతో టీడీపీ హై కమాండ్ ఈ చర్యలకు ఉప క్రమించింది.