ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ హిందూపురం రవాణా అధికారులు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణం పోతే మళ్లీ వస్తుందా అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైకులు నడపాలి అని సూచించారు. అలాగే కార్లు నడిపేవాళ్లు సీట్ బెల్టులు పెట్టుకోవాలని అన్నారు. "రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది చనిపోతుంటారు. కొన్నిసార్లు మన తప్పు ఉండకపోవచ్చు కొన్నిసార్లు మనదే తప్పు అయ్యుండొచ్చు ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు కాబట్టి వాహనదారులు డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసం బైకులపై స్టంట్లు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అనుకరిస్తున్నారు. లైకుల కోసం బైకులపై ఫీట్లు చేయడం సరికాదు. జీవితం చాలా విలువైనదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎక్కడా నిబంధనలు అతిక్రమించవద్దు.బాధ్యత గల పౌరులుగా నడుచుకోండి" అని బాలకృష్ణ హితవు పలికారు.కాగా, ఈ కార్యక్రమంలో బాలయ్య హెల్మెట్ ధరించి బుల్లెట్ నడిపారు.