దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొలువైన అందమైన పూలతోట అమృత్ ఉద్యాన్ ఫిబ్రవరి 2 నుంచి సందర్శకులకు స్వాగతం పలకనుంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అమృత్ ఉద్యాన్ ను సందర్శించేందుకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30వ తేదీ వరకు అనుమతిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారంలో ఆరు రోజుల పాటు సందర్శించవచ్చని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మద్య సందర్శకులు రావొచ్చని వివరించారు. రాష్ట్రపతి భవన్ లో 15 ఎకరాల్లో ఈ సుందరమైన పూదోట ఉంటుంది. ఇందులో కోలియస్, సెలోషియా, ట్యూబరోస్ తదితర అనే రకాల పూల మొక్కలు, అరుదైన మొక్కలను ఉంటాయి. వీటిలో శీతాకాలంలో పుష్పించే కొన్ని మొక్కలతో ప్రస్తుతం అమృత్ ఉద్యాన్ కనులవిందు చేస్తోంది. కాగా, ఈ గార్డెన్ ను సందర్శించే ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి గేట్ నెం.35 వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ షటిల్ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ నాడు అమృత్ ఉద్యాన్ మూసి ఉంచుతారు. ఆ రోజున సందర్శకులను అనుమతించరు. ఫిబ్రవరి 20, 21న రాష్ట్రపతి భవన్ లో సందర్శకుల సమావేశం కారణంగా ఉద్యానవనం మూసి ఉంచుతారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా కూడా ఈ గార్డెన్ ను సందర్శించేందుకు అనుమతించరు.