ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత పన్ను విధానం రద్దు.. నిపుణులు ఏమంటున్నారు

business |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 11:08 PM

వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 1వ తేదీనే పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదాయపు పన్నుకు సంబంధించి ఊరట కల్పిస్తారని భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈసారి బడ్జెట్‌లో పాత పన్ను విధానంకి స్వస్తి పలకనున్నారని తెలుస్తోంది. పూర్తిగా కొత్త పన్ను విధానమే అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వివిధ రకాల ట్యాక్స్ మినహాయింపులు, రాయితీలు పొందేందుకు వీలుండదు. ఎందుకంటే కొత్త పన్ను విధానంలో ఏమీ లేవు.


ప్రస్తుతం రెండు పన్ను విధానాలు అమలవుతున్నాయి. 2020 బడ్జెట్‌లోనే కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. అయితే, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. పన్ను శ్లాబుల్లో మార్పులు, పన్ను మినహాయింపుల పరిమితి, స్టాండర్డ్ డిడక్షన్ వంటి మార్పులన్నీ కొత్త పన్ను విధానంలోనే మార్చారు. ఎక్కువ మంది కొత్త విధానాన్ని ఎంచుకునేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అలాగే పాత పన్ను విధానాన్ని రద్దు విషయంపై ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


అయితే, పాత పన్ను విధానం రద్దు విషయంపై సీఏలు, ఆర్థిక నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు తమకు ఏది సరైన విధానమో లెక్కించి ఎంచుకోవడం క్లిష్టమైన ప్రక్రియ అని, అందుకే సులువుగా ఉండే కొత్త పన్ను విధానమే కొనసాగించడం మేలను కొందరు చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం మంది ట్యాక్స్ పేయర్లు కొత్త విధానానికి మారిపోయిన క్రమంలో మిగిలిన వారిని సైతం ఈ విధానంలోకి తీసుకొచ్చేందుకు ఇంకొన్ని మార్పులు అవసమని చెబుతున్నారు.


అయితే, ఉన్నట్టుండి పాత పన్ను విధానం రద్దు చేస్తే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పన్ను ఆదా పథకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. పాత పన్ను విధానం ఎంచుకున్న వారు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టారు. దీంతో వారంతా తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే కనీసం మూడేళ్ల సమయం ఇవ్వాలంటున్నారు. అలాగే ఇప్పటికిప్పుడే పాత విధానాన్ని రద్దు చేయకపోయినా ముగింపు ఉంటుందన్న సంకేతాలు ఇవ్వొచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారో తెలవాలంటే వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com