ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింత ఆకర్షణీయంగా కొత్త ఆదాయ పన్ను విధానం

business |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 11:28 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక.. తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా 8వ సారి రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. అయితే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు.. ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా పాత పన్ను విధానాన్ని దూరంగా జరుపుతూ.. కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మారుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పన్ను శ్లాబుల్ని సవరించడం సహా స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వంటివి జరిగాయి. ఇప్పుడు 2025 బడ్జెట్‌పైనా వేతన జీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు.


సంకీర్ణ ప్రభుత్వం కావడం.. ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జేడీయూ ఉండటం.. బిహార్‌లో ఈ సంవత్సరమే ఎన్నికలు ఉండటంతో అక్కడ ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చి ప్రజల్ని దీనివైపు మళ్లించే ప్రయత్నం జరగొచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాండర్డ్ డిడక్షన్‌ను మరోసారి పెంచే అవకాశాలు ఉన్నాయి.


2020-21 బడ్జెట్ సమయంలో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్డీయే ప్రభుత్వం. తర్వాత్తర్వాత దీంట్లో చాలా మార్పులు చేర్పులు చేసి టాక్స్ పేయర్లను మరింత ఆకర్షితుల్ని చేశారు. 2024 బడ్జెట్ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంలో రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇంకా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ చందాదారులకు కూడా లబ్ధి చేకూర్చారు. పాత పన్ను విధానంలో రూ. 50 వేలుగానే స్టాండర్డ్ డిడక్షన్ ఉంది.


స్టాండర్డ్ డిడక్షన్ అంటే వేతన ఆదాయంపై పన్ను విధించే ముందుగా ఈ స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తారు. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది. స్వల్ప మొత్తంతో అధిక టాక్స్ శ్లాబ్‌లోకి వచ్చేవారికి ఇక్కడ పన్ను తగ్గించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.


>> కొత్త పన్ను విధానంలో.. పాత పన్ను విధానం మాదిరిగా ఎక్కువగా మినహాయింపులు లేవన్న సంగతి తెలిసిందే. దీంతో పన్ను నిపుణులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనివైపు టాక్స్‌పేయర్లను మళ్లించేందుకు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు ఒక్కటే ఉన్న మార్గంగా చెప్పొచ్చు. పన్ను వ్యవస్థను కూడా సరళంగా ఉంచి.. అన్ని వర్గాల వారిని ఆకర్షించొచ్చు. ఈసారి దీనిని రూ. లక్షకు పెంచాలనే డిమాండ్ ఉంది. ఇంకా పన్ను ఆదాయంపై కొంత శాతం మేర తగ్గింపు ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.


1974లో ముందుగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద స్టాండర్డ్ డిడక్షన్ తొలిసారి పరిచయం చేశారు. పన్ను సంక్లిష్టతల్ని సరళతరం చేయడమే ఉద్దేశంగా వచ్చింది. 2005లో మాత్రం ఎందుకో తొలగించారు. మళ్లీ 2018లో ఎన్డీయే ప్రభుత్వం రూ. 40 వేల స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తూ తిరిగి ప్రవేశపెట్టింది. 2019 బడ్జెట్లో రూ. 50 వేలకు పెంచారు. 2023లోనే కొత్త పన్ను విధానంలోకి తెచ్చారు. తర్వాత ఏడాది రూ. 75 వేలకు పెంచారు. ఇప్పుడు రూ. లక్షకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com