భోగాపురం స్థానిక జాతీయ రహదారి అనుకుని ఉన్న గంగిరావి చెరువులో గురువారం తేలిన మృతదేహం భోగాపురానికి చెందిన యువకుడు పసుపులేటి వెంకటేష్(24)గా గుర్తించామని ఎస్ఐ వి. పాపారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురానికి చెందిన పసుపులేటి సూరిబాబుకు ఇద్దరు కుమారులు. ఇటీవల పెద్దకుమారుడు హైదరాబాద్ వెళ్లి పోయాడు. చిన్న కుమారుడు పసుపులేటి వెంకటేష్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం, కూలి పనులు చేస్తుండేవాడు. అయితే ఈనెల 23న మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మణిమ్మ, సూరిబాబు గ్రామంలో స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. అయి తే గురువారం ఉదయం గంగిరావి చెరువులో మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తు పట్టలేని రీతిలో ఉంది. ఎట్టకేలకు తల్లిదండ్రులు మృతదేహాన్ని గుర్తించి బోరుమన్నారు. మృతుడు తండ్రి సూరిబాబు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ పాపారావు తెలిపారు.