రాజధాని అమరావతికి మణిహారం వంటి ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం.. గత ఐదేళ్లుగా ఆగిపోయిన దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఇప్పటికే ఓఆర్‌ఆర్‌కు ఆమోదం తెలిపింది. అయితే అలైన్‌మెంట్‌లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు సూచించింది. ఆ ప్రకారం మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి కూడా ఆమోదం లభించిందని, మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.కేంద్రం తాజాగా ఆమోదించిన అలైన్‌మెంట్ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డు 189.4 కి.మీ మేర ఏర్పాటు కానుంది. గుంటూరు, కృష్ణా జల్లాల్లోని 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో నిర్మాణం సాగనుంది. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఇటీవల ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌పై డ్రోన్ సర్వే చేయగా రెండుచోట్ల చేపల చెరువులు, ఒకచోట గోడౌన్, మరోచోట నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జుజ్జూరు, దుగ్గిరాలపాడు మధ్య, మైలవరం వద్ద, సగ్గూరు వద్ద, గుంటూరు జిల్లాలోని శలపాడు, వేజెండ్ల మధ్య ఈ మార్పులు చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. ఓఆర్‌ఆర్ తూర్పు భాగంలో కృష్ణాజల్లా వల్లూరుపాలెం- గుంటూరు జిల్లా మున్నంగి మధ్య 4.8 కి.మీ మేర ఒక వంతెన, పల్నాడు జిల్లా బలుసుపాడు కృష్ణాజిల్లా మున్నలూరు మధ్య 3.150 కి.మీ మేర మరొక వంతెన నిర్మించనున్నారు.