ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపు అర్ధ సెంచరీలతో ఇంగ్లండ్ కు 181 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని బద్దలు కొట్టడంలో రవివిష్ణోయ్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను భారత్ తీసుకుంది. గాయపడిన శివమ్ దూబే స్థానంలో అతనికి అవకాశం లభించింది. ఇది అతనికి తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నహర్షిత్ రాణా నాలుగో వికెట్‌ను పడగొట్టాడు. తొలి ఓవర్ రెండో బంతికే లియామ్ లివింగ్‌స్టోన్ కీలక వికెట్ తీయడంతో మ్యాచ్ అక్కడి నుంచి మలుపు తిరిగింది. హర్షిత్ రాణా అక్కడితో ఆగలేదు జాకబ్ బెత్లే వికెట్ పడగొట్టడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్లో కేవలం 6 పరుగులకే ఓవర్టన్ వికెట్ తీశాడీ యంగ్ బౌలర్. దీంతో ఆఖరి ఓవర్ లో ఇంగ్లండ్ విజయం 6 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది.
ఈ మ్యాచ్‌లోనూ భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. ఓపెనర్లు సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి.. మహమూద్ భారత్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు. అయితే మూడో డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ (30; 26 బంతుల్లో 4×4, 1×6) కాసేపు మెరుపులు మెరిపించాడు. అయితే, జట్టు స్కోరు 79 పరుగుల వద్ద కార్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్ చేతికి చిక్కాడు. కానీ ఆల్ రౌండర్లు శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7×4,2×6), హార్దిక్ పాండ్య (53;30 బంతుల్లో 4×4, 4×6) వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. శివమ్ దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.