జగన్ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం నా ప్రాధాన్యతలు అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు ఏమిటీ? అని మాజీమంత్రి కన్నబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... ఏ రంగాన్ని తమ ప్రయారిటీలో పెట్టారో వెల్లడించాలి. దావోస్ వెళ్ళడమే అద్భుతమైన ఘట్టంగా ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఎంఓయు చేసుకోకుండా రాష్ట్రానికి తిరిగి వచ్చి, దావోస్ లో ఎంఓయులు గొప్పకాదు అంటూ మాట మార్చేశారు. జగన్ గారు ఆర్థిక విధ్వంసం సష్టించారు, అప్పుల పాలు చేశారంటూ దుష్ప్రచారం చేశారు.
పారిశ్రామికవేత్తలు రావాలంటే జగన్ గారు మళ్లీ అధికారంలోకి రారు అని రాసివ్వమని అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కేసులతో భయపెట్టి పారిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఏ ధైర్యంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు? ప్రతి సందర్భంలోనూ వైయస్ జగన్ గారి ఇమేజ్ ను దెబ్బతీస్తున్నామనే భ్రమతో చంద్రబాబు, లోకేష్ లు చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ దెబ్బతిన్నది. తమ రాజకీయం కోసం ఏపీ ఇమేజ్ ను దెబ్బతీయడం వల్ల కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా పరిశ్రమ పెడదామని భూముల కోసం సర్వే చేస్తుంటేనే గద్దల వారిపై పడి వేధిస్తున్నారు.లోకేష్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ రెడ్ బుక్ ను అమలు చేస్తామని చెప్పారు. దావోస్ కు వెళ్ళి వేధింపులు కొనసాగిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మా చేతుల్లో ఉన్నాయని చెబుతుంటే, ఐఎఎస్, ఐపీఎస్ లపై తప్పుడు కేసులు పెట్టి పాలనను దిగాజారుస్తుంటే ఏ నమ్మకంతో పెట్టుబడులు పెడతారు?అని ఆగ్రహం వ్యక్తపరిచారు.