అవినీతిని అంతం చేస్తానని, కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ చివరకు నరేంద్ర మోదీకి డూప్ లాగా మారిపోయాడని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ నేతపై మండిపడ్డారు. ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చి పదేళ్లు గడిచాయని చెప్పారు. యమునా నది శుద్ధి అయినట్లేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే యమునా నది నీటిని తాగాలని కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. ఆయన నిజంగానే తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆ నీరు తాగితే ఆసుపత్రిలో చేరాల్సిందేననే చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని రాహుల్ ఆరోపించారు. ఇటు ఆప్ లో, అటు బీజేపీలో.. రెండు పార్టీలు కూడా దళితులను దూరం పెడతాయని, పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్క దళితుడికీ చోటు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆప్ లో చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ సహా తొమ్మిది మంది పేర్లు మాత్రమే వినిపిస్తాయని, అందులో ఒక్కరు కూడా దళిత వర్గానికి చెందిన వారు లేరని విమర్శించారు. మోదీకి, కేజ్రీవాల్ కు మధ్య ఉన్న తేడా కేవలం ఒక్కటేనని, మోదీ ఓపెన్ గా మాట్లాడతారు కేజ్రీవాల్ మౌనంగా ఉంటారని చెప్పారు. అవసరమైన సందర్భాలలో కూడా కేజ్రీవాల్ బయటకు వచ్చి మాట్లాడరని రాహుల్ మండిపడ్డారు.ఢిల్లీ ఎన్నికలు ఐకమత్యానికి, ద్వేషానికి మధ్య జరుగుతున్న పోరాటమని రాహుల్ గాంధీ చెప్పారు. రెండు పార్టీలు, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటమని వివరించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ద్వేషాన్ని వెదజల్లే బీజేపీకి, ఐకమత్యంతో ప్రేమను పంచే కాంగ్రెస్ పార్టీకి మధ్య పోరు అని చెప్పారు. ప్రస్తుతం పదవిలో ఉన్నారు కాబట్టి మోదీ పేరు చాలాచోట్ల వినిపిస్తోందని, పదవి నుంచి దిగిపోయాక ఎవరూ ఆయనను తలుచుకోరని రాహుల్ చెప్పారు. మహాత్మా గాంధీ, గాడ్సేలలో ఎవరూ గాడ్సేను తలుచుకోరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.