విజయవాడలోని జక్కంపూడి పరిధిలో 132 ఎకరాల ఖాళీ ప్లాట్లలో యాసిడ్ డంప్ చేయడంపై అక్కడి ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో ఓ ట్యాంకర్ డ్రైవర్‌ను పట్టుకుని అక్కడి ప్లాట్ ఓనర్లు పోలీసులకు అప్పగించారు. వైజాగ్ నుంచి యాసిడ్ తీసుకుని ట్యాంకర్లలో తరలించి, అక్కడి ప్లాట్లలోని మట్టిలో ప్రమాదకరమైన రసాయనాలు వేస్తున్నారని ప్లాట్ యజమానులు చెబుతున్నారు. ఈ కేసులో క్రెబ్స్ బయోకెమికల్స్ అనే కంపెనీ పేరుతో ట్యాంకర్లలో యాసిడ్ తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో తమ ప్లాట్లలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను చూసిన ప్లాట్ ఓనర్లు వాటిని అడ్డుకున్నారు.ప్రముఖ రసాయన సంస్థ క్రెబ్స్ బయోకెమికల్స్ నుంచి వచ్చిన ఈ ట్యాంకర్లు, వైజాగ్ నుంచి ఔషధ రూపంలో ఉండే హానికరమైన యాసిడ్‌ను తీసుకెళ్లి, జక్కంపూడి ప్రాంతంలోని కొన్ని ఖాళీ ప్లాట్లలో పూడ్చే యత్నం చేశారని ఓనర్లు చెబుతున్నారు. ఈ డంపింగ్ వల్ల ఆ ప్రాంతంలోని గాలితోపాటు నీరు కూడా విషపూరితం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోపాటు పర్యావరణం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడి నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.