రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా గతేడాది డిసెంబరులో కేంద్ర విదేశాంగ మంత్రి అమెరికా పర్యటన గురించి ప్రస్తావించారు. జనవరి 20న జరిగిన అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని కోరడానికే జైశంకర్ అమెరికా వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మనకంటూ ఒక ఉత్పత్తి వ్యవస్థ, సొంత టెక్నాలజీ ఉంటే అమెరికా అధ్యక్షుడే ఇక్కడకు వచ్చి ప్రధానిని ఆహ్వానిస్తారు’ అని రాహుల్ అన్నారు. దేశంలో ఉత్పత్తి, సాంకేతికరంగాలపై భారత్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీనికి కౌంటర్ ఇచ్చారు. భారత విదేశాంగ విధానం గురించి రాహుల్ అవగాహనలేని ప్రకటనలు చేస్తున్నారని అని మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీలు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కాగా, ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరైన విషయం తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ఆయన మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ఎంపీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు.
‘‘డిసెంబరు 2024లో నా అమెరికా పర్యటనపై ప్రతిపక్ష నేత అవాస్తవాలు మాట్లాడారు... బైడెన్ యంత్రాంగంలోని విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారును కలిసేందుకు వెళ్లాను. ఆ తర్వాత భారత కాన్సుల్ జనరల్‌లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించాను.. ఏ దశలోనూ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదు.. సహజంగా అలాంటి ఈవెంట్లకు మన ప్రధాని వెళ్లరనే విషయం అందరికీ తెలిసిందే.. ప్రత్యేక ప్రతినిధులనే భారత్ పంపుతుంది... రాజకీయ ఉద్దేశాలతో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటివి ప్రకటనలు విదేశాల్లో మన దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’ అని జైశంకర్ పేర్కొన్నారు.