ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నటుడు సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.కాగా, నటుడు సోనూ సూద్ ఏపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌లు రెగ్యులర్ గా కనిపించే అంబులెన్స్‌ల తరహాలో కాకుండా, ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.