ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు భారీ ఉపశమనం కల్పిస్తూ వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును రూ.12 లక్షలకు పెంచింది కేంద్రం. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇది కొత్త పన్ను విధానానికి వర్తిస్తుందని చెప్పారు. సెక్షన్ 87ఏ కింద రిబేట్ రూ.60 వేలకు పెంచారు. అయితే, మీ ఆదాయంలో స్పెషల్ రేట్ ఇన్‌కమ్ ఉంటే మీకు సెక్షన్ 87ఏ వర్తించదు. దీంతో మీ ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నా మీరు భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
ఈ విషయంపై బడ్జెట్ 2025లోనే క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. స్పెషల్ రేట్ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ రిబేట్ రాదని తెలిపింది. స్పెషల్ ట్యాక్స్ రేట్ ఆదాయంలో సెక్షన్ 111ఏలోని స్వల్ప కాలిక మూలధన లాభాలు, సెక్షన్ 112లోని దీర్ఘకాలిక మూలధన లాభాల వంటివి ఉంటాయి. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఆదాయం మొత్తం రూ.12 లక్షలు ఉందని అనుకుందాం. అందులో మీకు శాలరీ ద్వారా రూ.8 లక్షలు వస్తుందని అనుకుందాం. మిగిలిన రూ.4 లక్షల ఆదాయం ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వస్తుందని అనుకుందాం. అప్పుడు మీకు కేవలం రూ.8 లక్షలకే సెక్షన్ 87ఏ ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్‌కమ్ రూ.4 లక్షలకు రిబేట్ వర్తించదు. దీనిపై మీరు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానంలో కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. సెక్షన్ 87ఏ రిబేట్ ద్వారా మీ రూ.8 లక్షల శాలరీపై ఎలాంటి ట్యాక్స్ పడదు. అయితే, రూ.4 లక్షల షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ పడుతుంది. క్యాపిటల్ గెయిన్స్‌పై స్పెషల్ రేట్ 20 శాతం ఉంటుంది. అప్పుడు మీ మొత్తం ట్యాక్స్ రూ.80 వేలు అవుతుంది. అంటే మీ శాలరీతో పాటు మీరు మూలధన లాభాలు అందుకున్నప్పుడు రిబేట్ రాదు. దీంతో దానిపై ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
మరోవైపు.. మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ద్వారా రూ.4 లక్షల వస్తుంటే అందులోంచి రూ.1.25 లక్షలకు పన్ను మినహాయింపు ఉంటుంది. మిగిలిన రూ.2.75 లక్షలపై 12.5 శాతం చొప్పున ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై రూ.34,375 ట్యాక్స్ పడుతుంది. ఈ విషయం తెలియకుండా రూ.12 లక్షలలోపే ఉంది కదా అని ఆదమరిచి ఉంటే ఐటీ నోటీసులు వస్తాయి. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.