మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు జరిగే విషాదాలను చూస్తుంటే.. ఇలా కూడా మృత్యువు సంభవిస్తుందా..? అన్న భయం కలుగుతుంది. ఒక్కోసారి మనవైపు నుంచి ఎలాంటి తప్పిదం లేకున్నా కూడా.. ఎదుటి వ్యక్తి చేసే చిన్న తప్పు కూడా విలువైన ప్రాణాలను తీస్తుంది. మరికొన్నిసార్లు అతివేగంగా దూసుకొచ్చే పెద్ద పెద్ద వాహనాలు మృత్యుశకటాలవుతుంటాయి. ఇవన్నీ కాకుండా.. రోడ్డు మీద వెళ్తుంటే.. ఒక్కసారిగా కుక్క, పంది, కోతి లాంటి జీవాలు కూడా వాహనానికి అడ్డు వచ్చి ఆగం చేస్తుంటాయి. అచ్చంగా అలాంటి ఘటనే చేటుచేసుకుంది. అలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్‌మెన్ అయిన శ్రీనివాస్.. ఆదివారం (ఫిబ్రవరి 02న) రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం కొండకల్ నుంచి వెలిమెలకు ఒంటరిగా బైక్ మీద వెళ్తున్నాడు. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమల తండా సమీపంలోకి రాగానే.. ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా ఓ అడవి పంది దూసుకొచ్చింది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అడవి పంది దూసుకురావటంతో.. దాన్ని తప్పించే క్రమంలో శ్రీనివాస్ బైక్ అదుపుతప్పింది. దీంతో.. కింద పడిపోగా తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.
స్థానికులు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైక్పై తన దారిలో తాను వెళ్తుంటే అడవి పంది దూసుకొచ్చి శ్రీనివాస్ ప్రాణం పోవటానికి కారణమవటాన్ని చూస్తుంటే.. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో దూసుకొస్తుందో చెప్పలేమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వద్ద.. శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యాదయ్య ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీనివాస్ అతనికి ఎంతో నమ్మకస్థుడిగా ఉంటూ వస్తున్నాడు. తాజా ప్రమాద ఘటనలో శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరమని పార్టీ వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నాయి. శ్రీనివాస్ మరణవార్తతో ఆయన స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.