చైనా.. మన పొరుగున ఉన్న అతిపెద్ద దేశం. ఆర్థికంగా, సైనికశక్తి పరంగా ఎలా చూసుకున్నా.. చైనా చాలా శక్తివంతమైన దేశమనే చెప్పాలి. అలాంటి చైనాకు అమెరికా అంటే గిట్టదు. అమెరికానే కాదు.. అమెరికాతో సన్నిహితంగా ఉండే ఏ దేశంతోనైనా చైనా కయ్యానికి కాలు దువ్వుతుంది. అలాంటి దేశానికి ఒక కల ఉంది. అదే ప్రపంచానికి పెద్ద అన్నగా ఎదగడం. కానీ, అది అమెరికా ఉన్నన్ని రోజులు సాధ్యపడదు. అందుకే అమెరికా కంటే చాలా శక్తివంతమైన దేశంగా ఎదగాలని చైనా చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడూ అదే పనిలో ఉంది చైనా. మెున్నటికి మెున్న డీప్ సీక్ పేరుతో ఏఐ చాట్ బాట్‌ను తీసుకొచ్చి అమెరికా కంపెనీలకు చుక్కలు చూపించింది. ఇప్పుడు ఏకంగా పెంటగాన్ కంటే 10 రెట్లు పెద్దదైన సైనిక స్థావరాన్ని నిర్మిస్తూ ప్రపంచానికే సవాల్ విసురుతోంది. మీరు విన్నది నిజమే... ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీ సిటీని చైనా నిర్మిస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన నివేదిక వెల్లడించింది.
యూఎస్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కొంతమంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజింగ్‌కు నైరుతి వైపున 30 కిలో మీటర్ల దూరంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలో భారీ బంకర్లను నిర్మిస్తోందని.. శాటిలైట్ చిత్రాలు అందుకు ఆధారాలని వారు చెబుతున్నారు. ఇక్కడ వందల క్రేన్లు 5 చదరపు కిలో మీటర్ల ప్రాంతంలో నిత్యం పనులు చేస్తన్నాయని.. జియో స్పేషియల్ ఏజెన్సీ మాజీ అధికారి ఒకరు అన్నారు. న్యూక్లియర్ దాడులు జరిగినా చైనా లీడర్లకు ఏమి అవ్వకుండా చాలా పటిష్టమైన నిర్మాణాలను చైనా చేపడుతోందని వారు అంటున్నారు. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేశారు. చైనా మిలటరీ సిటీ నిర్మాణాన్ని గత కొద్దిరోజులుగా అమెరికా ఇంటెలిజెన్స్ చాలా నిశితంగా పరిశీలిస్తోంది.
చైనా నిర్మిస్తున్న ఈ నిర్మాణం.. మిలటరీ సిటీనే అని చెప్పడానికి అనేక సాక్ష్యాలు బయటికి వచ్చాయి. వాటిలో మెుదటిది ఆ ప్రాంతంలో పెద్దస్థాయిలో నిర్మాణాలు జరుగుతుండటం. పోనీ అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదా మాల్ లాంటిది అయితే.. ఇప్పటికే చైనీస్ మీడియాల్లో రావాలి. కానీ, అలాంటిది ఎక్కడా జరగలేదు. పైగా చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా డల్‌గా ఉంది. ఈ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రారంభించరు. పైగా చైనా ప్రభుత్వంలోని అధికారులు అప్పుడప్పుడు ఈ నిర్మాణ రంగాన్ని పరిశీలిస్తున్నారంట. దీంతో ఇక్కడ జరిగే నిర్మాణం మిలటరీ సిటీనే అని చెప్పవచ్చని అమెరికా మాజీ సీఐఏ అధికారి ఒకరు అంటున్నారు.
మిలటరీ సిటీ నిర్మాణం 2024 మధ్యలోనే ప్రారంభమైనట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండేళ్లలో అంటే 2027లో జరిగే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలు జరిగే సమయానికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు తైవాన్‌పై దాడి చేసేవిధంగా కూడా సిద్ధమవ్వలాని అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మిలటరీకి ఆదేశాలు ఇచ్చినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనా పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే కర్మాగారాలను కూడా పెంచుకుంటుంది.
భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధం వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధమన్నట్టు చైనా భారీ బంకర్ నిర్మిస్తోంది. ఇది పూర్తయితే తైవాన్‌పై దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా కన్పిస్తోంది. దీంతో యుద్ధ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు, మిలటరీ అధికారులు సేఫ్‌గా ఉండేందుకు.. ఈ బంకర్లను చైనా నిర్మిస్తోంది. దీనిపై వైట్ హౌస్ ఇప్పటివరకు అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ, పెంటగాన్ అధికారులు ఎప్పటికప్పుడు చైనా మిలటరీ సిటీపై నిఘా వేస్తున్నట్టు తెలుస్తోంది. అటు ట్రంప్ అధికారంలోకి వచ్చీ రావడంతో ఫెంటనిల్ డ్రగ్ పేరుతో చైనా దిగుమతులపై 10 శాతం అదనపు పన్ను విధించాడు. ఇక మిలటరీ సిటీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుంటే మాత్రం చైనాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అప్పుడు రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మెుదలవుతుంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో కూడా చెప్పలేం. దీంతో చైనా ఎలాంటి యుద్ధం వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా దీనిని నిర్మిస్తున్నట్టు అర్థమవుతోంది.