మరోసారి వాణిజ్య యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ తెరలేపడంతో అటు ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లు ఆందోళనకు గురవుతున్నారు. మిత్రదేశాలైన కెనడా, మెక్సికోతో పాటు చైనాలపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయం ప్రతీకార చర్యలకు కారణమవడంతోపాటు ధరలు కూడా పెరిగే ప్రమాదముందనే ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. దేశం గొప్పగా మారాలంటే.. దిగుమతి సుంకాల పెంపుదల భారం మోయాల్సిందేనని అమెరికన్లకు తేల్చిచెప్పారు. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుతో పౌరులు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చన్నారు. అయితే, ఈ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దిగుమతి సుంకాల పెంపు తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య లోటు ఉన్న దేశాలపై సుంకాలు విధిస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం పన్నులను విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉందన్న ట్రంప్.. అధ్యక్షుడిగా పౌరులందరికీ భద్రత కల్పించడం తన బాధ్యత అని తెలిపారు. అక్రమ వలసదారులను, డ్రగ్స్‌ను దేశ సరిహద్దుల్లోకి రాకుండా తరమికొడతానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చానని, దానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.
అటు, ట్రంప్ నిర్ణయంపై కెనడా, మెక్సీలు తీవ్రంగా స్పందించారు. ఆ దేశాలు ప్రతీకార చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అగ్రరాజ్యం దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మెక్సికో సైతం అదే దారిలో వెళ్తోంది. తాము కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ప్రకటించారు. దీంతో అమెరికన్లపై మరింత భారం పడొచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికాపై వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీవో)లో ఫిర్యాదు చేస్తామని చైనా ప్రకటించింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడి అవకాశాలు ఏమేరకు ఉంటాయనే విషయం
అటుంచితే.. ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు మాత్రం అధికంగా ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అమెరికా పౌరులను మరింత ఇబ్బందులకు గురిచేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నింటికి సిద్ధంగా ఉండాలని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.