ఫిబ్రవరి 1న శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు వరాలు కురిపించారని, తెలంగాణకు రిక్తహస్తమే మిగిలిందని కాంగ్రెస్ ఆరోపించింది. రైల్వే ప్రాజెక్ట్‌లకు నిధులు, కొత్త రైళ్ల ఊసేలేదని విమర్శిస్తోంది. తాజాగా, ఈ ఆరోపణలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని చెప్పారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన.. కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉండటంతో జాప్యం జరుగుతోందని అన్నారు. అలాగే, తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని, తాజా బడ్జెట్‌లో అందుకు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు.
ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి ట్రాక్‌లను పరిశీలించాం... ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను అనుసరిస్తున్నాం.. వందేభారత్ స్లీపర్ రైళ్లు ట్రయల్ రన్ జరుగుతోంది. అత్యంత ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో 1,326 కి.మీ మేర ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉంది. మరో 1,026 కి.మీ.మేర ఏర్పాటు చేస్తున్నాం.. 2026లోపు దేశవ్యాప్తంగా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తాం.. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పుతాం..
తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.. ఆ రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి... పేదలు, సామాన్యుల కోసం నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం... త్వరలో దేశమంతటా దాదాపు 100 నమో భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నాం.. ఈ రైళ్ల ద్వారా పేదలు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. కాాగా, బడ్జెట్‌లో రైల్వేలకు కేంద్రం రూ. 2.65 లక్షల కోట్లు కేటాయించింది. అంతేకాదు, కొత్తగా 200 వందేభారత్, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లను వచ్చే మూడేళ్లలో పట్టాలెక్కింనున్నట్టు తెలిపారు.