విద్యార్థులకు అండగా ఉండేందుకు ఈనెల 5న (బుధవారం) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సోమవారం అనంతపురం జిల్లాలో అన్ని విద్యార్థి సంఘాలు ఫీజు పోరుకు సంఘీభావం తెలుపుతూ.. ఐక్యంగా ఉద్యమించేందుకు ముందుకు వచ్చాయి. వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు, బీసీ సెల్ రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ రమేష్ గౌడ్ నేతృత్వంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి ఫృథ్వీ, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, జీవీఎస్ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్, గిరిజన విద్యార్థి నాయకులు లక్ష్మీపతి నాయక్, ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు బిల్లే జగదీష్, ఎస్వీఎస్ఎఫ్ బీసీ చక్రధర్ యాదవ్, హర్ష, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నే చిరంజీవి, బీసీ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కేశవ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రూ.3900 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 5న అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. సప్తగిరి సర్కిల్, సూర్య నగర్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందివ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యను కూటమి ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటూ తెలుగు మహాసభల్లో కూటమి నేతలు, మేధావులు అని చెప్పుకునే మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎంవీ రమణ, రామోజీరావు కోడలు శైలజా కిరణ్ తదితరులు మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం ఇలాంటి తెలుగు మహాసభల్లో మాత్రమే తెలుగు ముద్దు.. ఇంగ్లీష్ వద్దు.. అంటారు కానీ, స్వయానా రామోజీరావు కోడలు శైలజా కిరణ్ నడుపుతున్న రమాదేవి పబ్లిక్ స్కూలులో తెలుగు సబ్జెక్టు లేకుండా జర్మన్, ఫ్రెన్స్, రష్యన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే మాట్లాడేలా నడుపుతున్నది నిజం కాదంటారా.. ధనవంతుల పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడాలి.. పేద పిల్లలు ఇంగ్లీషులో చదవకూడదా అంటూ రమేష్ గౌడ్ ప్రశ్నించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకుండా.. డబ్బున్నటువంటి, మీలాంటి ఇళ్లలో పాచి పనులు చేయాలా.. అంటూ నిలదీశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.1780 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే వైఎస్ జగన్ సీఎం కాగానే ఆ బకాయిలను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 37 వేల పైచిలుకు పాఠశాలలను నాడు`నేడు పథకం కింద అభివృద్ధి చేసి.. కార్పొరేట్ దీటుగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. తాజాగా ఫీజులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. లేకపోతే పరీక్షలకు సైతం అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఫీజుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలోనే విద్యార్థులకు అండగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ‘ఫీజు పోరు’ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సమావేశంలో వైసీపీ నాయకులు బెస్త వెంకటేష్, చంద్ర, నరసింహులు, నాగేంద్ర, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లబ్బె రాఘవ, వంశీ, మోహన్, గణేష్, మారుతి, బాలాజీ, వినీత్, రోహిత్ కుమార్, చిన్న, హరీష్, మణికంఠ, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు కైలాష్, వైసీపీ నాయకులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.