ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవాళ(సోమవారం) 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తొలుత 45 నిమిషాల అనుకున్న భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పరిణామాలు, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల వైసీపీ దుష్పరిపాలన, పలు రంగాల వారీగా జరిగిన నష్టంపై 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ తక్కువ జీడీపీ ఉండటం, దానికి గల కారణాలపై కూడా ప్రజంటేషన్లో వివరించారు. ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి చెప్పిందని, రాష్ట్రం అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నివేదించిందని చంద్రబాబు గుర్తుచేశారు.