గతంలో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో వారు ప్రాథమిక స్థాయిలోనే చదువులకు స్వస్తి చెబుతుండేవారు. ఈనేపథ్యంలో 8వతరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులో ఉంచేందుకు యూపీ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి దగ్గరలో బడి ఉంటే పిల్లలు అడుతూపాడుతూ వెళ్లి చదువుకుంటారు. అదే 6వ తరగతికే విద్యార్థులు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవాలంటే ఎంత కష్టమో పాలకులు ఆలోచించడం లేదు. ప్రభుత్వం తాజా సంస్కరణల ఫలితంగా ప్రకాశం జిల్లాలో 62 యూపీ స్కూళ్లు ప్రాథమిక పాఠశాలలుగా డౌన్ గ్రేడ్ కాబోతున్నాయి. మరో 71 యూపీఎస్‌లపై మూసివేత కత్తి వేలాడుతోంది. ఇంకో 48 బడులను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.పాఠశాలల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు 6, 7, 8 తరగతుల్లో 30మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీ స్కూళ్లను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేస్తారు. తదుపరి ఆ బడులను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ నిబంధనల ప్రకారం 30మందిలోపు పిల్లలు ఉన్న 62 యూపీ స్కూళ్లు మండల ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్ కాబోతున్నాయి. ఈ పాఠశాలలకు హైస్కూళ్లు దూరమైనా సరే విలీనం చేయాల్సిందే. అవసరమైతే విద్యార్థికి సంవత్సరానికి రూ.6వేలు ప్రయాణ భత్యం చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు. 30మందిలోపు పిల్లలు ఉన్న పాఠశాలల్లో కొన్నింటిలో ముగ్గురు, నలుగురు, పదిమంది లోపు సుమారు 10 యూపీ స్కూళ్లలో ఉన్నారు. ఈ పాఠశాలలు అనివార్యంగా డౌన్‌గ్రేడ్ కావా ల్సిందే.