సీపీఎం రాష్ట్ర సారథ్యం మరోసారి వి.శ్రీనివాసరావుకు దక్కింది. వరుసగా రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర 27వ మహాసభల ముగింపు సందర్భంగా సోమవారం పార్టీ నూతన రాష్ట్ర నాయకత్వ ఎన్నిక జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పలు ప్రజాసంఘాలలో పనిచేసే కీలక నేతలు మొత్తం 49 మందితో రాష్ట్ర కమిటీ, వారిలో 15 మందితో కార్యదర్శివర్గం ఏర్పాటైంది. ఆ కమిటీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జిల్లాలోని మర్రిపూడి మండలం కెల్లంపల్లికి చెందిన శ్రీనివాసరావు విద్యార్థి దశ నుంచి సీపీఎంలో పనిచేస్తున్నారు.
నెల్లూరు, కావలిలో చదువుతూ సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో క్రియాశీలకంగా నెల్లూరు జిల్లాలో వ్యవహరించారు. అనంతరం యువజన సంఘమైన డీవైఎఫ్‌ఐలోనూ అదే జిల్లాలో పనిచేశారు. డీవైఎఫ్‌ఐలో రాష్ట్ర, జాతీయ నేతగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుసంఘం ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం కొనసాగారు. ఆసమయంలో రైతు సంఘ నేతగా గుర్తింపు పొందారు. సీపీఎం జాతీయ కమిటీలోనూ పనిచేసిన వీఎస్‌ఆర్ రాష్ట్ర విభజన అనంతరం తిరిగి ఏపీకి వచ్చి క్రియాశీలకంగా పనిచేశారు.