సిట్ జరిపిన అరెస్టులు నెయ్యి టెండర్ల ఉల్లంఘన మీద తప్ప, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని కాదని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకున్నాయని, దీంతో ఆయన్ను బయటపడేసేందుకు కొన్ని పత్రికలూ ఆపసోపాలు పడుతున్నాయని అంబటి ఎద్దేవా చేశారు.
లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలే లేవన్న అంబటి, టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లు కొండపైకి చేరే అవకాశమే లేనప్పుడు లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు చెప్పినట్టు పంది కొవ్వు కలిసే అవకాశమే ఉండదని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన చేసిన ఆరోపణలకు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.