విమాన ప్రయాణం అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకొన్నది. కానీ ఇది చాాలా ఛీఫ్ అంటోంది ఓ మహిళా. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్.. ప్రస్తుతం మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివాసం ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుమారుడికి 12 ఏళ్లు కాగా, కుమార్తెకు 11 సంవత్సరాలు. అయితే ఈమె దేశ రాజధాని నగరమైన కౌలాంలపూర్‌లోని ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య దూరం చాలా ఎక్కువ. అయినప్పటికీ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. దీంతో రాచెల్ కౌర్.. మొదట్లో కౌలాలంపూర్‌లోనే ఓ గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది.
వారంలో ఐదు రోజులు పని చేశాకా.. వారాంతపు సెలవుల కోసం పెనాంగ్ వెళ్లేది. కానీ రాజధాని నగరంలో నివాసం వల్ల ఖర్చులు కూడా చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా అద్దె, వారం వారం ఇంటికి వెళ్లి రావడం కోసం రాచెల్‌కు నెలకు 474 డాలర్లు (రూ.41,000) అయ్యాయి. ఖర్చు ఎక్కువవడమే కాకుండా.. రోజూ తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్న రాచెల్‌కు అది ఏమాత్రం నచ్చలేదు. దీంతో దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలనుకుంది. పూర్తి కుటుంబాన్ని ఇక్కడికే తీసుకు వచ్చి ఉంచితే మరింత ఖర్చు అవుతుందని భావించిన ఆమె.. పిల్లల వద్దే ఉంటూ రోజూ ఆఫీసుకు వచ్చి వెళ్లాలని నిర్ణయించుకుంది.
అయితే బస్సులు, రైళ్లలో రావడం వల్ల చాలా సమయం వృథా అవుతుంది కాబట్టి.. విమానంలో ప్రయాణిస్తే బాగుంటుందని భావించింది. ఈక్రమంలోనే విమానానికి రోజూ వచ్చి పోవడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసింది. ముఖ్యంగా ఇలా నెలకు కేవలం 316 డాలర్లు (రూ.27,000) మాత్రమే ఖర్చు అవుతున్నట్లు గుర్తించిన తెగ సంబుర పడిపోయింది. 2024లో ఈ నిర్ణయం తీసుకున్న రాచెల్.. కౌలాలంపూర్‌లో అద్దె ఇంటిని ఖాళీ చేసి పెనాంగ్‌కు వెళ్లిపోయింది. అక్కడే తన పిల్లలతో ఉంటూ రోజూ విమానం ద్వారా ఆఫీసుకు వెళ్లి వస్తోంది.
దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా.. తన పిల్లలను తానే దగ్గరుండి చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని రాచెల్ కౌర్ వెల్లడిస్తోంది. కాకపోతే ఇందుకోసం ఉదయం 4 గంటలకే నిద్రే లేవాల్సి వస్తుందని.. 5 గంటలకల్లా రెడీ అయి 6.30 గంటలకు విమానం అందుకోవాలని చెబుతుంది. అలా ప్రతిరోజూ విమానంలో ప్రయాణిస్తూ.. 7.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 10 నిమిషాల కాలి నడకన వెళ్తే తన ఆఫీసు వస్తుందని.. ఇలా రోజూ 7.45 గంటలకు ఆఫీసుకు చేరుకుని రాత్రి 8 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. వారానికి ఐదు రోజులు ఇలా ఆఫీసుకు వెళ్తున్న రాచెల్ కౌర్.. ప్రతి రోజూ 700 కిలో మీటర్ల ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. దీని వల్ల కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవుతుందని.. కాకపోతే పిల్లల కోసం ఈమాత్రం చేయడం తనకేమీ కష్టంగా లేదని వెల్లడించింది.
![]() |
![]() |