కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కింగ్ మార్కెట్‌కు చెందిన హేమంతకుమారి అనే విశ్రాంత కోర్టు ఉద్యోగి నుంచి సైబర్ నేరస్థులు రూ.53.54 లక్షలు స్వాహా చేశారు. సీఐ రామయ్య నాయుడు వివరాల మేరకు.. హేమంత కుమారి కోర్టు ఉద్యోగి పదవీ విరమణ పొందారు. భర్త కొద్ది కాలం కిందటే మృతి చెందాడు. పిల్లలు కూడా లేరు. ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె పదవీ విరమణ అనంతరం రూ.45 లక్షలు బెనిఫిట్స్ వచ్చాయి. విటన్నింటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో భద్రపరు చుకుంది. గత ఏడాది నవంబరులో ఓ అపరిచిత వ్యక్తి ఆమెకు కాల్ చేశారు. తాను ఎన్స్‌ఫోర్స్‌మెంటు ఎస్‌ఐనంటూ.. మీ మీద కేసులు ఉన్నాయి.. వారెంటు వచ్చిందంటూ బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె రూ.45 లక్షలను ఆ అపరిచితుడు సూచించిన అకౌంటుకు ఆర్‌టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి బెదిరించడంతో రూ.8.5 లక్షలను బదిలీ చేసింది. తర్వాత తాను మోసపోయానని గుర్తించి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంబంధిత నగదు బదిలీ చేసిన అకౌంట్లను పరిశీలిస్తే కలకత్తాకు చెందిన అకౌంట్లుగా గుర్తించారు.
![]() |
![]() |