ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ రాత్రి పడుకునేముందు కొన్ని పనులు చేయాలంట

Life style |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:49 PM

బరువు తగ్గడం అనేది కేవలం ఆహారంలో మార్పులు, వ్యాయామంతో మాత్రమే సాధ్యం కాదు. రోజువారీ దినచర్య, జీవనశైలి కూడా బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చాలా మంది ఉదయం దినచర్య, ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. అయితే, రాత్రిపూట మాత్రం ఓ క్రమశిక్షణ పాటించరు. ఏది పడితే అది తింటారు, ఎలా పడితే అలా ఉంటారు. ఈ చిన్న తప్పులే బరువు తగ్గడానికి అడ్డంకిగా మారతాయి. ఎందుకంటే రాత్రి పూట లైఫ్‌స్టైల్ జీవక్రియ, నిద్ర నాణ్యత, బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.


మీరు కూడా బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేదని బాధపడుతున్నారా? అయితే, రాత్రి పూట మీరు కొన్ని పనులు చేయకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. బరువు తగ్గాలనుకుంటే రాత్రి నిద్రపోయే ముందు కొన్ని అలవాట్లు మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఈ అలవాట్లు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సాయపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యంలో కూడా అద్భుత మార్పులు కనిపిస్తాయి. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


టైమ్‌కి తినడం, తేలిక భోజనం


బరువు తగ్గడంలో రాత్రి భోజనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తింటారు. ఇది కడుపుపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ తిండి అలవాట్ల కారణంగా బరువు పెరుగుతారు. అందుకే రాత్రి పూట భోజనం తేలికగా, పోషకాలతో ఉండేలా చూసుకోండి. ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సలాడ్స్, తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు చేర్చుకోండి. నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయండి. దీంతో శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలదు. అంతేకాకుండా హాయిగా నిద్రపోవచ్చు.


బాగా నిద్రపోండి


మంచి నిద్రకి, బరువు తగ్గడానికి మధ్య రిలేషన్ ఉంది. సరిగ్గా నిద్రపోకపోతే హార్మోన్ల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆకలి పెరుగుతుంది. దీంతో ఏది పడితే అది తింటారు. ఇంకేముంది బరువు తగ్గడం పక్కనపెడితే బరువు పెరిగే అవకాశం ఉంది. రోజుకు 7 నుంచి 8 గంటల మంచి నిద్ర అవసరం. పడుకునే ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి. కావాలనుకుంటే నిద్ర రావడం కోసం ఒక పుస్తకం చదవవచ్చు, ధ్యానం చేయవచ్చు లేదా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. హాయిగా నిద్రపడుతుంది.


గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ


పడుకునే ముందు వేడి నీరు లేదా హెర్బల్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. గోరువెచ్చని నీరు శరీరం నుంచి హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ, చమోమిలే టీ లేదా పుదీనా టీ వంటి హెర్బల్ టీలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఈ టీలు శరీరానికి విశ్రాంతినిస్తాయి. నిద్రను మెరుగుపరుస్తాయి. కానీ నిద్రపోయే ముందు కెఫిన్ ఉన్న పదార్థాలు తాగకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది.


స్ట్రెచింగ్ లేదా యోగా


రాత్రి పడుకునే ముందు లైట్ స్ట్రెచింగ్ లేదా యోగా చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. లైట్ స్ట్రెచింగ్ వల్ల కండరాల ఒత్తిడి తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బాలసనం, వజ్రాసనం, అనులోమ-విలోమ ప్రాణాయామం వంటి యోగా భంగిమలు జీర్ణక్రియను బలోపేతం చేస్తాయి. జీవక్రియను పెంచుతాయి. ఈ ఆసనాలు మిమ్మల్ని ప్రశాంతపరుస్తాయి. బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.


సానుకూల ఆలోచనలు, ప్రణాళికలు


బరువు తగ్గడంలో ఆలోచన కూడా చాలా ముఖ్యమైనది. పడుకునే ముందు, ప్రతికూల ఆలోచనలకు గుడ్ బై చెప్పండి. సానుకూలంగా అంటే పాజిటివ్‌గా థింక్ చేయండి. అంతేకాకుండా మరుసటి రోజు గురించి ప్లాన్ చేసుకోండి. నెరవేర్చాల్సిన లక్ష్యాలపై దృష్టి పెట్టండి. బరువు తగ్గడానికి ఉదయాన్నే ఏం తినాలి, ఏ వ్యాయామం చేయాలి, వాకింగ్ ఎంత సేపు చేయాలని ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఓ క్లారిటీ వస్తుంది. బరువు తగ్గడంలో ఈ ప్లానింగ్ కచ్చితంగా సాయపడుతుందని నిపుణులు అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com