ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బరువు తగ్గలేకపోతున్నారా? సింపుల్‌గా పాకితే సరిపోతుందట!

Life style |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:56 PM

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.


వాకింగ్ బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్. అయితే వాకింగ్, జాగింగ్ ఎలానో క్రాలింగ్ (పాకడం) కూడా బరువు తగ్గడానికి మంచి వ్యాయామం. క్రాలింగ్ వ్యాయామం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. క్రాలింగ్ అంటే ఏం లేదండి.. చిన్న పిల్లలు నేలపై పాకుతుంటారు కదా. అలానే, పాకుతూ చేసే వ్యాయామాన్ని క్రాలింగ్ అంటారు. క్రాలింగ్ వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలాంటి క్రాలింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే బరువు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం.


క్రాలింగ్ వ్యాయామంతో ప్రయోజనాలు


క్రమం తప్పకుండా 1 గంట పాటు క్రాలింగ్ చేయడం ద్వారా రోజుకు 600 నుంచి 800 కేలరీలు బర్న్ చేయవచ్చు. ఇది మీ బరువును సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా మీ కండరాలు బలంగా మారుతాయి. క్రాలింగ్ వ్యాయామంలో చేతులు, మణికట్టు, మోచేతులు, వెన్నెముక, తుంటి, కాళ్ళు నిరంతరం కదులుతాయి. దీని కారణంగా ఈ కండరాల కణజాలం బలంగా మారుతుంది, శరీరంపై పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది.


రక్తపోటు నియంత్రణలో ఉంటుంది


క్రాలింగ్ వ్యాయామం మొత్తం శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక పరిశోధన ప్రకారం, క్రాల్ చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిపిస్తుంది. వెన్నెముకను బలోపేతం చేయడంలో ఈ వ్యాయామం సాయపడుతుంది. రోజువారీ వ్యాయామంలో క్రాలింగ్ భాగం చేసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


ఇంకా ఎన్నో ప్రయోజనాలు


* రోజూ క్రాలింగ్ వ్యాయామం చేయడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో, భుజాల బరువు మోసే సామర్థ్యం పెరుగుతుంది.


* క్రాలింగ్ చేయడం వల్ల కాళ్లు, చేతులు, వెన్నెముక, తుంటి, మణికట్టు, మోచేతులు ఇలా ప్రతి భాగం కదులుతుంది. దీంతో కండరాల బలం పెరగడంతో పాటు శరీరం సరైన ఆకృతిని పొందుతుంది.


* రోజూ క్రాలింగ్ వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.


* రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రాలింగ్ వ్యాయామం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.


ఎలా చేయాలి?


* ముందుగా చేతులు, మోకాళ్లపై నేలపై కూర్చోండి.ఇప్పుడు మణికట్టును భుజాల కిందకు, మోకాళ్లను తుంటి కిందకు తీసుకురండి.


* ఈ స్థితిలో వెనుక భాగం ఖచ్చితంగా నిటారుగా ఉండాలని గుర్తుంచుకోండి.


* ఇప్పుడు మోకాళ్ళను నేలపై రెండు అంగుళాలు ముందుకు కదిలించండి.


* చివరగా, ఎదురుగా ఉన్న చేయి, కాలును రెండు నుంచి మూడు అంగుళాలు ముందుకు కదిలించడం ద్వారా క్రాల్ చేయడం ప్రారంభించండి.


* ప్రతి క్రాలింగ్‌లో కొన్ని సెకన్ల పాటు ఆగి, ఆపై మరొక చేయి, కాలుతో ముందుకు సాగండి.


ఎంతసేపు చేయాలి?


* మొదట్లో ఈ వ్యాయామం 15 నిమిషాలు చేయండి. మీకు అలసట అనిపిస్తే, మధ్యలో 1-2 నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు.


* సాధన తర్వాత, సమయాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. దీన్ని గరిష్టంగా 1 గంట పాటు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.


* మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు. కానీ ఆహారం తిన్న వెంటనే చేయకండి.


* ఎందుకంటే శరీరం లోపల జీర్ణక్రియ ప్రక్రియకు శక్తి కూడా అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాయామాన్ని సరిగ్గా చేయలేరు.


వీళ్లు చేయకూడదు


* ఆర్థరైటిస్ సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించకుండా ఈ వ్యాయామం చేయవద్దని నిపుణులు అంటున్నారు.


* గర్భధారణ సమయంలో మహిళలు ఈ వ్యాయామం చేయకూడు. కానీ ఆమె ప్రసవించిన కొన్ని నెలల తర్వాత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకుని క్రాలింగ్ వ్యాయామం చేసుకోవచ్చు.


* వృద్ధులు కూడా వైద్యుడిని సంప్రదించకుండా దీన్ని చేయకూడదు. ఎందుకంటే ఇది కీళ్ళు, వీపుపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది సమస్యలను కలిగిస్తుంది.


క్రాలింగ్ వ్యాయామాలు, రకాలు


* ఎలుగుబంటి క్రాలింగ్ : ఈ వ్యాయామంలో, మీరు ఎలుగుబంటిలా క్రాల్ చేయాలి. దీని కోసం చేతులను జంతువులాగా ఉపయోగించి నాలుగు కాళ్లపై నిలబడండి. ఈ సమయంలో వీపు, మెడ సరళ రేఖలో ఉండేలా చూసుకోండి. అదే సమయంలో చేతులు, కాళ్ళ మధ్య దూరం ఉంచండి. ఇప్పుడు ఈ భంగిమలో క్రాల్ చేయండి.


* గొరిల్లా క్రాలింగ్ : ఈ వ్యాయామంలో మీరు గొరిల్లా లాగా క్రాల్ చేయాలి లేదా దూకాలి. దీని కోసం, గొరిల్లా భంగిమలోకి వచ్చి ముందుకు దూకండి. మీ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా ఈ వ్యాయామం చేయండి.


* బేబీ క్రాలింగ్ : ఈ వ్యాయామంలో, పిల్లల భంగిమలో క్రాల్ చేయాలి. దీని కోసం, మీ చేతుల మద్దతు తీసుకొని కొంతసేపు నేలపై క్రాల్ చేయండి. ఇది కొవ్వును బర్న్ చేసి బరువు తగ్గడానికి సాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com