భారత్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఫుడ్ డెలివరీ విభాగంలో ఇప్పటికే చాలా సంస్థలు సేవలందిస్తున్నాయి. నచ్చిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకున్న నిమిషాల్లోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. దీంతో ఈ సంస్థలకు ఆదరణ పెరుగుతోంది. ఎన్ని సంస్థలు ఉన్నా ఈ విభాగంలో దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ (Swiggy) రాణిస్తున్నాయి. మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు సంస్థల మధ్యే ప్రధానమైన పోటీ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవలం సంస్థ ర్యాపిడో సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసేందుకు ర్యాపిడో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో కంపెనీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు ర్యాపిడో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఫుడ్ డెలివరీలు అందించేందుకు చర్చలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పలు రెస్టారెంట్ల నిర్వాహకులతో సంస్థ ప్రతినిధులు సమావేశం అయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్‌లో అమలు చేస్తున్న కమిషన్ విధానాన్ని సవాలు చేసే లక్ష్యంతో వ్యాపార ప్రణాళికపై కసరత్తు చేపట్టింది.
2015లో ర్యాపిడో క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. దశాబ్దం కంటే తక్కువ సమయంలో దేశంలోని రైడ్ షేరింగ్‌లో రెండో స్థానంలో కైవసం చేసుకుంది. కంపెనీ ఇప్పటికే తన టూ- వీలర్ సేవలను ఉపయోగించి వ్యక్తిగత రెస్టారెంట్లకు డెలివరీ సేవలను అందిస్తోంది. ఇప్పటికే 100 నగరాల్లో ర్యాపిడో క్యాబ్ సేవలను అందిస్తోంది. 2025 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 500 నగరాలకు తమ క్యాబ్ సేవలను విస్తరించాలని ర్యాపిడో కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి సైతం ఎంట్రీ ఇస్తుండడంతో వ్యాపార విస్తరణ మరింత వేగవంతమవుతున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. పుడ్ డెలివరీలో ఏకచత్రాధిపత్యం చలాయిస్తున్న కంపెనీలకు గట్టి పోటీ ఇన్వనున్నట్లు పేర్కొన్నాయి.
![]() |
![]() |