ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తిమీర, కరివేపాకు రెండ్రోజులకే వాడిపోతున్నాయా

Life style |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 10:36 PM

కూరల్లో కరివేపాకు రాగానే కొంతమంది తీసిపారేస్తుంటారు. మరికొంతమంది హెల్త్‌ కోసమైనా తినేస్తారు. అలానే కొత్తిమీర కూడా. ఎంత నచ్చకపోయినా కూడా వీటిని వేయడం వల్ల రుచి పెరుగుతుంది. పైగా ఆరోగ్యానికి వచ్చే లాభాల గురించి అందరికీ తెలియడం వల్ల వీటిని ప్రతీకూరల్లోనూ వేయడమే కాకుండా, వాటితో ప్రత్యేకంగా పచ్చళ్లు, పొడులు కూడా తయారుచేసి వాడుతున్నారు. దీంతో చాలా టేస్టీ టేస్టీగా వాడేసుకుంటున్నారు. అయితే, వీటిని రోజూ కొనుక్కుని తీసుకురాలేం. వారానికి ఓ సారి తీసుకొస్తాం. అలా తీసుకొచ్చిన వాటిని స్టోర్ చేస్తాం. ఎంతలా స్టోర్ చేసినా ఇవి త్వరగా వాడిపోయినట్లుగా అయిపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టిన ఓ సారి నల్లగా మారతాయి. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే మరేం చేయాలో తెలుసుకోండి.


కొత్తిమీర స్టోర్ చేసేందుకు


కొత్తిమీరని తీసుకురాగానే ముందుగా పసుపు పచ్చగా ఉన్న ఆకుల్ని తీసేయాలి.


అదే విధంగా, కొద్దిగా నల్లగా మారినా వాడిపోయినట్లుగా ఉన్నా ఆ ఆకుల్ని, కొమ్మల్ని తీసేయాలి. వాటిని చల్లని నీటితో కడిగేయాలి. తర్వాత నీట్‌గా ఉండే మంచి క్లాత్‌తో తేమ అంతా పోయేటట్టుగా తుడవాలి.


కేవలం ఆకులే కాదు, కొమ్మలు కూడా డ్రై అయ్యేలా చూడండి.


స్టోర్ చేయడం


ఇప్పుడు ఆకుల్ని కొద్దిగా తడిగా ఉన్న పేపర్ టవల్ లేదా కిచెన్ టవల్స్‌లో వదులుగానే చుట్టండి.


వీటిని ప్లాస్టిక్ బ్యాగ్ లేదా కంటెయినర్‌లో ఉంచండి.


ఈ బ్యాగ్‌ని సీల్ చేయడం లేదా, కంటెయినర్‌ని టైట్‌గా మూత పెట్టి రిఫ్రిజ్‌రేటర్‌లో పెట్టేయండి.


ఫ్రిజ్ లేకుండా


అదే విధంగా, ఫ్రిజ్‌లేకపోయినా కొన్ని రోజుల పాటు కొత్తిమీరని తాజాగానే ఉంచుకోవచ్చు. దీనికోసం ముందు చెప్పిన ప్రాసెస్‌లోనే కొత్తిమీరని కడిగి పొడిగా తుడిచేయాలి. మాయిశ్చర్ అంతా తీసేసి పేపర్ టవల్‌లో చుట్టేసి కంటెయినర్‌లో ఉంచండి. ఇలా ఉంచినవి చాలా రోజుల వరకే తాజాగా ఉంటాయి.


వాటర్ మెథడ్


అదే విధంగా, కొత్తిమీరని వేర్లతో సహ ఓ చిన్న జార్‌లో నీరు పోసి అందులో ఉంచాలి. ఎలా అంటే బొటిక్‌లో ఫ్లవర్స్ ఉంచినట్లుగా. కాండాలు మునిగిపోవద్దు. అయితే, కొత్తిమీర మొత్తాన్ని క్లీన్ చేశాకే ఉంచండి. ఇలా తయారుచేసిన జార్‌ని ఎండ తగలకుండా చూసుకోండి.


కరివేపాకు


కరివేపాకుని తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి తడి లేకుండా చేయండి.


ఇప్పుడు వీటిని గాలి చొరబడని కంటెయినర్‌లో ఉంచి కిచెన్ టవల్స్ మధ్య ఆకులని ఉంచండి.


జిప్‌లాక్ బ్యాగ్స్ అయినా పర్లేదు.


వీటిని మనం ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలి.


డ్రైగా చేసి


అదే విధంగా, వీటిని మరీ నెలల పాటు కూడా వాడుకునేలా ఉండాలంటే.. వీటిని చక్కగ డ్రై చేసి వాడుకోవచ్చు. ముందుగా కరివేపాకుల్ని బాగా శుభ్రంగా కడగాలి. తర్వాత తడి లేకుండా డ్రై చేయాలి. వీటిని ఇంట్లోనే నీడలో ఆరబెట్టుకోవచ్చు. లేదా మైక్రోవేవ్‌లో పూర్తిగా డ్రై చేయాలి. ఇలా అయిన ఆకుల్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు.


వీటిని ఫ్రిజ్‌లో ఉంచి 3 నెలల వరకూ వాడుకోచ్చు.


కొత్తిమీరని కూడా ఇలానే వాడుకోవచ్చు.


ఫ్రీజర్‌లో


ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకుల్ని ఫ్రీజింగ్ మెథడ్‌లో కూడా చాలా రోజుల వరకూ వాడుకోవచ్చు. దానికోసం ఆకులన్నింటిని విడివిడిగానే బాగా కడిగి శుభ్రంగా చాప్ చేయాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ఫ్రీజర్ బ్యాగ్స్, కంటెయినర్స్‌లో వేసి ఫ్రీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం చాలా రోజుల వరకూ వాడుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com