ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ ఛైర్మన్‌కు రాజమౌళి తండ్రి సంచలన లేఖ

national |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 07:32 PM

రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ దన్ఖడ్‌కు రచయిత, రాజమౌళి తండ్రి విజేయంద్ర ప్రసాద్ లేఖ రాశారు. పెద్దల సభను మరింత హుందాగా, బాధ్యతాయుతంగా ఎలా నిర్వహించాలో సూచనలు చేసిన ఆయన.. చాలా మంది సభ్యులు చర్చల్లో పాల్గొనకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలోనూ ఇంకా రిజిస్టర్‌లో సంతకాలు ఏంటి? అని.. టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. రాజ్యసభలోని ప్రతి ద్వారం వద్ద ఫేస్ ఐడెంటిఫికేషన్ కెమెరాలను ఏర్పాటు చేసి సభ్యుల ఉనికి ఖచ్చితంగా నమోదు చేయాలని, దీంతో ఎంట్రీ, ఎగ్జిట్‌లను తెలియజేస్తుందన్నారు.


సభ్యులు సభలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కార్యకలాపాల ఖచ్చితమైన రికార్డను ఇది నిర్ధారిస్తుందన్నారు. స్టార్ గుర్తు ఉన్న ప్రశ్నలపై వివరణాత్మక చర్చ జరగాలని కోరారు. ‘ముందురోజు ప్రశ్నలను అడిగిన సభ్యులకు మాత్రమే కాకుండా రాజ్యసభ సభ్యులందరికీ లిఖితపూర్వక సమాధానాలను అందించాలి... ఇది సభ్యులు ప్రతిస్పందనలను క్షుణ్ణంగా సమీక్షించడానికి, మరింత అర్థవంతమైన, సమాచారం ఉన్న అనుబంధ ప్రశ్నలను సంధించడానికి వీలు కల్పిస్తుంది’ అని ఆయన సూచించారు.


ఇదే సమయంలో తరచుగా సభా కార్యక్రమాల్లో ఏర్పడుతోన్న అంతరాయాలపై కూడా ఆయన స్పందించారు. ఇది అనవసరమైన గందరగోళానికి దారితీస్తుందని, ఒక అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వరని అన్నారు. దీనికి ఉదాహరణగా “రెండేళ్ల కిందట జరిగిన ఒక చర్చలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కావేరీ నదీజలాలపై మాట్లాడుతుండగా.. తమిళనాడుకు చెందిన మరో ఎంపీ జోక్యం చేసుకున్నారు.. దీనిపై గందరగోళం కొనసాగుతుండగా కర్ణాటక, తమిళనాడు ఎంపీలు ఒకరిపై ఒకరు అరుస్తూనే ఉన్నారు.. సభలో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఛైర్మన్‌ను 10 నిమిషాలు పట్టింది. ఆ సమయానికి, చర్చ ఉద్దేశం నీరుగారిపోయింది’ అని పేర్కొన్నారు.


‘అటువంటి సందర్భాలలో ఆరుగురు ప్యానెల్ స్పీకర్లలో ఒకరిని ఛైర్మన్ ఎంచుకోవాలి.. వీరికి ఇరు పక్షాలతో రాజకీయంగా సంబంధం ఉండదు. సాధారణంగా సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఎంపికచేసిన ప్యానెల్ స్పీకర్ అధ్యక్షతన ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కావాలని ప్రతిపాదించాలి.. ఈ సమయంలో ఆసక్తి ఉన్నవారు చర్చలో పాల్గొంటారు’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.


దీంతో పాటు సభలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం గురించి కూడా ఆయన సూచనలు చేశారు. సభ్యులు టేబుల్ వద్ద ట్యాబును పెట్టుకోడానికి అనుమతించాలన్నారు. తద్వారా టెలివిజన్, మానిటర్‌లతో కనెక్ట్ అయి, తాము చెప్పడానికి ప్రయత్నిస్తున్న అంశాన్ని ఫోటోలు, గ్రాఫిక్ సాయంతో వివరించడానికి సహాయపడతుందని రాజ్యసభ ఎంపీ తన లేఖలో అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com