రెండేళ్ల క్రితమే భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే ఇద్దరు కుమారులు ఉండగా.. వారి బాధ్యత అతడిపై పడింది. ఇన్నాళ్లూ పిల్లలను బాగానే చూసుకున్న అతడికి.. ఒంటరిగా ఉండడం ఇష్టం లేక రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కుమారులు మాత్రం వద్దన్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు అంగీకరించలేదు. అయినా సరే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ తండ్రి.. పిల్లల్ని చంపేస్తే తన సమస్య తీరిపోతుందుకున్నాడు. కేసు తన మీదకు రాకుండా ఉండేదుకు తల్లి సాయం తీసుకుని కుమారులను మట్టుబెట్టాడు. ఆపై ఏం జరిగిందంటే
ఒడిశా నయాగఢ్ జిల్లా ఫతేఘర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల ప్రకాష్ మొహంతి 15 ఏళ్ల క్రితమే కుమా నాయక్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు కుమారులు కూడా పుట్టారు. కానీ రెండేళ్ల క్రితమే కుమా నాయక్ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ప్రకాష్ ఒంటరిగానే ఉంటూ తన ఇద్దరు పిల్లల(14 ఏళ్ల ఆకాశ్ మొహంతి, 9 సంవత్సరాల బికాష్ మొహంతి)ను చూసుకంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రకాష్ తల్లిదండ్రులు కూడా బతికే ఉండగా.. కుమారుడికి సాయం చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉండగా.. ప్రకాష్‌కు రెండో పెళ్లి చేసుకోవాలని ఆశ పుట్టింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా సరేనన్నారు. పిల్లల్ని చూసుకోవడం సులభం అవుతుందని భావించారు. ప్రకాష్ కూడా కొన్ని సంబంధాలు చూశాడు. ఆ విషయం తెలుసుకున్న కుమారులు ఆకాష్, బికాష్‌లు మాత్రం తండ్రి రెండో పెళ్లికి ఒప్పుకోలేదు. వద్దని వారించారు. కానీ ఎలాగైనా సరే రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రకాష్.. కుమారుల అడ్డు తొలగించుకుంటే.. ఇక ఏ సమస్యా ఉండదనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లి 68 ఏళ్ల సౌరి మొహంతికి వివరించాడు.
ఆమె కూడా కుమారుడు ఒంటరిగా ఉండడం చూడలేక.. పిల్లల్ని చంపేసి పెళ్లి చేసుకోమని తెలిపింది. దీంతో వీరిద్దరూ కలిసి పిల్లల హత్యకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా మార్చి 9వ తేదీన అర్ధరాత్రి పిల్లలు పడుకున్నాక ప్రకాష్ వారి గొంతులు కోశాడు. ఆపై చీరను వారి మెడలకు బిగించి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పిల్లలను హత్య చేసిన అనంతరం ప్రకాష్ బయకు వెళ్లిపోయాడు. సౌరి మొహంతి మాత్రం తన మనుమళ్లు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఏడవడం ప్రారంభించింది. విషయం గుర్తించిన స్థానికులు వచ్చి ప్రకాష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆకాశ్, బికాష్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. వారి మెడపై కోసిన గాయాలు కనిపించాయి. దీంతో ప్రకాష్, సౌరిలను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించగా.. తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |