కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు.. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెరగనుంది. త్వరలోనే ఈ పెంపు ప్రకటన రావచ్చు. నిపుణుల అంచనా ప్రకారం 2 శాతం మేర పెంపు జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. కొందరు నిపుణులు మాత్రం 3 శాతం వరకు పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఈ పెంపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది. ఇది కాకుండా, 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే ఆమోదం తెలిపారు. జనవరి 1, 2026 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుండి 2.85 వరకు ఉండవచ్చని అంచనా. ఇక 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే.. ప్రస్తుతం డీఏ 50 శాతానికి మించి ఉంది కాబట్టి దీనిని ప్రాథమిక జీతంలో కలుపుతారని, అప్పుడు మళ్లీ డీఏ సున్నా నుంచి ప్రారంభిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక డీఏ ఇప్పుడు 2 శాతమే పెరిగితే.. గత ఏడేళ్లలో ఇదే అతి తక్కువ డీఏ పెంపుల్లో ఒకటిగా ఉంటుంది. 2018 జులైలో కూడా 2 శాతమే పెరిగింది. అప్పుడు 7 శాతం నుంచి 9 శాతానికి చేరింది. డీఏ పెరిగితే దానికి అనుగుణంగానే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు పెరుగుతాయి. ప్రస్తుతం డీఏ.. ప్రాథమిక జీతంలో 53 శాతంగా ఉంది. ఉదాహరణకు రూ.20,000 ప్రాథమిక జీతం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.400 డీఏ పెరుగుతుంది. చివరిసారిగా డీఏ పెంపు.. 2024 అక్టోబర్ సమయంలో వచ్చింది. ఇది జులై నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి చేరింది.
డీఏఅనేది జీవన వ్యయ భత్యం. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఉద్యోగులకు, పెన్షనర్లకు సహాయపడుతుంది. ఇక్కడ పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులకు డీఏ రూపంలో చెల్లిస్తారన్నమాట. కేంద్రం ఏటా రెండు సార్లు డీఏను సవరిస్తుంటుంది. ఏటా జనవరి, జులైల్లో ప్రకటించాల్సి ఉన్నా.. ఆలస్యంగా ప్రకటిస్తూ వస్తోంది. అయినప్పటికీ జనవరి, జులై నుంచి అమల్లోకి తెస్తుంది.
ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా డీఏ రేటును నిర్ణయిస్తారు. కార్మిక శాఖ దీనిని ప్రకటిస్తుంది. గత 6 నెలల ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రభుత్వం DA పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ఒక వేళ డీఏ 3 శాతం పెరిగితే.. అప్పుడు రూ. 18 వేలు ప్రాథమిక జీతం ఉన్న ఉద్యోగికి.. డీఏ నెలకు రూ. 540 పెరుగుతంది. రూ. 50 వేల ప్రాథమిక వేతనం ఉంటే.. అప్పుడు రూ. 1500 పెరుగుతుంది.
![]() |
![]() |