ఔరంగజేబు సమాధి చుట్టూ మహారాష్ట్రలో రాజకీయ, మతపరమైన వివాదాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఔరంగజేబు సమాధిని కూల్చేస్తామంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేసిన ప్రకటనతో నాగ్‌పూర్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒక మతగ్రంథానికి నిప్పుపెట్టారన్న ప్రచారంతో ఒక వర్గం చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. పోలీసులు అదుపుచేయడానికి ప్రయత్నించగా.. వారిపైనా రాళ్లు రువ్వారు. దీంతో ఘర్షణలకు దారితీసి 20 మంది గాయపడ్డారు. ఇటీవల బాలీవుడ్లో వచ్చిన ఛత్రపతి మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరెకిక్కిన ఛావా సినిమాతో ఔరంగజేబు సమాధి అంశం తెరపైకి వచ్చింది.
నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉండే మహల్ ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసి... భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రంకల్లా కోత్వాలీ, గణేష్‌పేట్ ప్రాంతాలకూ ఘర్షణలు వ్యాపించాయి. ఈ అల్లర్లలో కూబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీసీపీ నికేతన్ కదమ్ తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
తర్వాత మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. శుక్రవారీ తలావ్‌రోడ్‌లోని ఛిత్నిశ్ పార్క్ వద్ద పలు వాహనాలకు నిప్పంటించి.. నివాస గృహాలపై రాళ్లు రువ్వారు. హింసను వీడి.. శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తిచేశారు. ఘర్షణలు చెలరేగిన మహల్ ప్రాంతంలో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ‘‘నాగ్‌పూర్ ప్రశాంతమైన నగరం.. ఇక్కడ ప్రజలు ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకుంటారు.. ఇదే నాగ్‌పూర్ సంప్రదాయం. ఏ పుకార్లను నమ్మవద్దు’’ అని ఆయన కోరారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద సోమవారం మధ్యాహ్నం బజరంగ్దళ్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తర్వాతే ఉద్రిక్త పరిస్థితి నెలకుందని పోలీసులు వెల్లడించారు. ఇక్కడ ఒక మతగ్రంథాన్ని మంటల్లో తగలబెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది నిజమని నమ్మిన మరో వర్గం మహల్ ప్రాంతంలో ఆందోళనలకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్రిక్తతలను తగ్గించి.. పరిస్థితి అదుపుచేసేందుకు పోలీసులు రంగలోకి దిగారు. పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర రిజర్వ్ బలగాలను భారీ ఎత్తున అక్కడ మొహరించారు. పలుచోట్ల 144 సెక్షన్ విధించి... నిరసనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఛిత్నిశ్ పార్క్ వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అయితే, ఔరంగజేబు దిష్టిబొమ్మను మాత్రమే దగ్ధం చేశామని బజరంగ్దళ్ వర్గాలు స్పష్టంచేశాయి.
నాగ్‌పూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రజల శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేవారు. ఎక్స్‌లో ఓ వీడియో సందేశం పోస్ట్ చేసిన నితిన్ గడ్కరీ.. ‘‘తప్పుచేసిన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.. ఈ పరిస్థితి గురించి సీఎం ఇప్పటికే స్పందించారు.. కాబట్టి ప్రతి ఒక్కరూ పుకార్లను పట్టించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa