బెంగళూరులోని హుళిమావులో ఒక ఇంట్లో సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32)గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు రాకేశ్‌ను పూణెలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌరీని హత్య చేసిన అనంతరం రాకేశ్ నేరుగా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం గమనార్హం. మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన వారు గౌరీ నివాసానికి చేరుకుని విచారణ చేపట్టారు.సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే హుళిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారు అక్కడికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఒక సూట్‌కేసు కనిపించిందని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సూట్‌కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం లభ్యమైందని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నిందితుడైన గౌరీ భర్త రాకేశ్ కోసం గాలిస్తుండగా, అప్పటికే అతడిని పూణె పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసిందని హుళిమావు పోలీసులు తెలిపారు. వెంటనే హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేశ్ పూణెకు పారిపోయి అక్కడి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని బెంగళూరుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బృందం పూణెకు బయలుదేరింది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌరీ, రాకేశ్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారని, రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని బెంగళూరు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాకేశ్ ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తుండగా, గౌరీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
![]() |
![]() |