ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో ఆదివారం దేవదేవుని రథోత్సవం వైభవంగా సాగింది. సాయంత్రం రథశాల వద్ద ఆలయ అర్చకులు రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి ఉభయ దేవాలయ ప్రాంగణంలో విశేష అర్చనలు, హారతులందుకున్న స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకొచ్చారు. పుష్పాలతో అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేశారు. గంగాధర మండపం నుంచి నంది మండపం దాకా, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు రథోత్సవం సాగింది. రథంపై ఆదిదేవులు ఆశీనులై ముందుకు సాగుతుండగా భక్తుల శివ నామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది. కాగా, ఆదివారం రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
![]() |
![]() |