సింగపూర్‌లో తన కుమారుడు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం బారినపడగా, తక్షణమే స్పందించి సహాయం అందించారంటూ ప్రధానమంత్రి రేంద్ర మోదీకి, పీఎంవోకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ అధికారులు, సింగపూర్ లోని భారత హైకమిషన్ కార్యాలయం సమన్వయంతో అందించిన సహాయం కష్ట సమయంలో ఎంతో భరోసానిచ్చిందని పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతంలో 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో పాల్గొని, ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తుండగా ఈ బాధాకరమైన వార్త తనకు అందిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తన కుమారుడికి, ప్రమాదంలో చిక్కుకున్న ఇతర పిల్లలకు సకాలంలో సహాయం అందించడం ద్వారా తన కుటుంబానికి ఎంతో ధైర్యం, ఉపశమనం లభించిందని అన్నారు."ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల జీవితాలను మెరుగుపరచడానికి మీకున్న దార్శనిక నిబద్ధతకు అడవి తల్లి బాట నిదర్శనం. ఈ వర్గాల అవసరాలను పరిష్కరించడానికి మీరు తీసుకున్న అనేక చర్యలలో ఇది ఒకటి. వారి జీవితాలను మార్చేందుకు మీరు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఇది కీలకమైన భాగం. పీఎం జన్ మన్, పీఎం జీఎస్ వై, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సహాయంతో, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1,069 కిలోమీటర్ల మేర రోడ్లను రూ.1,005 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇది 601 బలహీన గిరిజన సమూహాల ఆవాసాల్లో కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గిరిజన ప్రాంతాల్లో రవాణాను మెరుగుపరుస్తుంది, పర్యాటకానికి మద్దతు ఇస్తుంది, సకాలంలో వైద్య సహాయం అందిస్తుంది, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న 'డోలీ' కష్టాలకు ముగింపు పలుకుతుంది" అని ప్రధాని మోదీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
![]() |
![]() |