ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్‌ చట్టం నిరసనకారులకు తెగేసిచెప్పిన దీదీ

national |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 08:06 PM

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీలు చేపట్టిన ఆందోళనలు.. హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లాలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టం 2025కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. ముస్లింలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం చెలరేగిన హింసకు సంబంధించి 118 మందిని అరెస్టు చేశామని వెల్లడించింది. చనిపోయిన వారిలో ఇద్దరు ఘర్షణల్లోనూ.., ఒకరు కాల్పుల్లో మరణించాడని అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), లా అండ్ ఆర్డర్, జావేద్ షమీమ్ పేర్కొన్నారు. మరోవైపు, ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జంగిపూర్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.


దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులో ఉందని, దానిని నిశితంగా పరిశీలిస్తున్నామని డీజీపీ వివరించారు. ముర్షిదాబాద్‌లో స్థానికంగా అందుబాటులో ఉన్న దాదాపు 300 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బందితో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు అదనంగా 5 కంపెనీలను బలగాలను మోహరించినట్లు గోవింద్ మోహన్ తెలిపారు. కేంద్రం కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.


కాగా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాష్ట్రంలో వక్ఫ్ (సవరణ) చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు. అంతేకాదు, ఈ విషయంలో కేంద్రంతో తేల్చుకోవాలని ఆందోళనకారులకు దీదీ తెగేసి చెప్పారు. ‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది.. మేము వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ఇవ్వం. ఈ చట్టం మా రాష్ట్రంలో అమలు చేయనప్పుడు అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి?’ అని ఆమె 


ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.


రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతోన్న తరుణంలో ఆమె స్పందించారు. శాంతి, సామరస్యాన్ని కోరిన ఆమె.. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని నొక్కి చెప్పారు. మతం ఆధారంగా రాజకీయ దుర్వినియోగాన్ని సహించబోమని, అల్లర్లను ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


‘గుర్తుంచుకోండి.. చాలా మంది వ్యతిరేకిస్తున్న ఈ చట్టాన్ని మేం చేయలేదు. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది.. కాబట్టి మీకు కావలసిన సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందాలి’ అని దీదీ పేర్కొన్నారు.


బీజేపీపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ


అటు, మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. కొంతమంది శక్తులు బెంగాల్‌లో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘అభివృద్ధి విషయంలో మాతో రాజకీయంగా పోరాడలేక చాలా మంది మతం పేరుతో విభేదాలు సృష్టించి బెంగాల్‌లో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సంయమనం పాటించాలని, బెంగాల్ సామరస్య సంప్రదాయాన్ని నిలబెట్టాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది బెంగాల్‌ను తగలబెట్టాలని కోరుకుంటున్నారు’ అని టీఎంసీ ఎంపీ అన్నారు.


మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసు వ్యాన్లు సహా పలు వాహనాలకు నిప్పుంటించారు. భద్రతా దళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి, రోడ్లను దిగ్బంధించారు. నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాలను రాష్ట్ర పోలీసులు సహించబోరని డీజీపీ రాజీవ్ కుమార్ ఆందోళనకారులను హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com