తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ పాలనలో పలు విభాగాల్లో భారీ ఎత్తున అవకతవకలు, తీవ్రమైన నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) జె. శ్యామలరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.టీటీడీ గోశాలల నిర్వహణపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, హిందువుల మనోభావాలను, టీటీడీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. గోశాలలో చోటుచేసుకున్న తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు తమ హయాంలో జరిగినవి కావని, 2021 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ఇందుకు ఆధారంగా గత విజిలెన్స్ నివేదికలను, ఫోటోలు, వీడియోలను ఆయన మీడియాకు చూపించారు."గోవులు తాగే నీరు నాచు పట్టినా, పురుగులు పట్టినా ఎవరూ పట్టించుకోలేదు. పురుగులు పట్టిన, దుర్వాసన వస్తున్న నాణ్యత లేని దాణా పెట్టారు. లేబుల్స్ లేని, గడువు తీరిన మందులను వినియోగించారు. గోశాల ప్రాంగణంలో మందులు ఎక్కడపడితే అక్కడ పడేశారు" అని విజిలెన్స్ నివేదికల ఆధారంగా ఈవో ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మరణించిన గోవుల వివరాలను (సప్రెషన్ ఆఫ్ డెత్స్) కూడా దాచిపెట్టారని, అసలు గోవులు లేని గోశాలకు దాణా సరఫరా చేసినట్లు చూపి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న పశువులను వేరుగా ఉంచకుండా మిగతా వాటితో కలిపి ఉంచడం, కనీసం విజిలెన్స్ అధికారులను కూడా తనిఖీలకు అనుమతించకపోవడం వంటివి గతంలో జరిగాయని నివేదికలను ఉటంకిస్తూ తెలిపారు. ఈ నివేదికలపై గతంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తాము ఇప్పుడు ప్రక్షాళన చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.గత మూడు నెలల్లో 100కు పైగా గోవులు చనిపోయాయన్న ఆరోపణను ఖండిస్తూ, జనవరి-మార్చి మధ్య 43 గోవులు మరణించాయని, ఇది గత సంవత్సరాల సగటుకు (నెలకు సుమారు 15) అనుగుణంగానే ఉందని తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా సహజ మరణాలు సంభవిస్తాయని, వీటిని దాచిపెట్టడం లేదని, పోస్టుమార్టం నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 59 దూడలు జన్మించాయని కూడా ఈవో శ్యామలరావు తెలిపారు. గోశాలల్లో సిబ్బంది కొరత ఉందని అంగీకరించి, ఖాళీగా ఉన్న 135 పోస్టులను భర్తీ చేయడానికి కమిటీ వేశామని తెలిపారు. ప్రస్తుత గోశాలల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని ఈవో అన్నారు.
![]() |
![]() |