తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికైనా పదవులు, బాధ్యతలు దక్కాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల ఆమోదం తప్పనిసరి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల మన్ననలు పొందని నేతలకు పార్టీలో స్థానం ఉండదని తేల్చిచెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.రానున్న కాలంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారికే సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా, కార్యకర్తలకు దూరంగా ఉండే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే, నాయకుడు తమ సొంత బూత్‌లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలని, అప్పుడే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు అవగతమవుతాయని సూచించారు. కుప్పంలో తాను కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తానని ఉదహరించారు.
![]() |
![]() |