పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. ప్రధానంగా హెడ్‌వర్క్స్ నిర్మాణాలకు సమాంతరంగా పునరావాస కాలనీల నిర్మాణం కూడా చేపట్టి ఆరు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. చింతూరు, కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలో సహాయ పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ ముసాయిదాకు రూపకల్పన చేస్తోంది. వేగంగా పనులు జరగని చోట్ల కాంట్రాక్టులు రద్దుచేసింది. కొత్త కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టులో క్షేత్ర స్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు పూర్తయ్యేలోపు నిర్వాసితులకు పూర్తిస్థాయి సహాయ పునరావాసం అందిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు తొలి దశలో మొత్తం 38,060 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈ పనులను పరుగులు తీయించడానికి తొలి దశ పనులను ఏ, బీ కేటగిరీలు వర్గీకరించారు. ఫేజ్-1ఏలో 20,946 కుటుంబాలు ఉన్నాయి. వారికోసం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 75 కాలనీల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకూ 26 పూర్తయ్యాయి. 14,369 కుటుంబాలను తరలించారు. 49 నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా 6,577 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మిగతా 49 కాలనీల్లో పనులు వేగవంతంగా జరుగకపోవడం వల్ల రాష్ట్రప్రభుత్వం జనవరిలో అప్పటి వరకూ ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. ఇంకా రూ.120 కోట్ల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి.
![]() |
![]() |