ఏప్రిల్ 28న జరిగిన కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరుసగా నాలుగోసారి విజయం సాధించింది. ఇక, ఈ ఎన్నికల్లో 22 మంది భారత సంతతికి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మంగళవారం కెనడాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రెండోసారి ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణస్వీకారం చేయగా.. ఆయన క్యాబినెట్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కడం చెప్పుకోదగ్గ విషయం. వారిలో అనితా ఆనంద్, మనీందర్ సిధూ మంత్రులుగా... రూబీ సహోతా, రణదీప్ సింగ్ సరాయ్‌లు స్టేట్ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అనితా ఆనంద్
న్యాయవేత్త, ప్రఖ్యాత రాజకీయవేత్త అయిన అనితా ఆనంద్ (57) విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. గతంలో జస్టిన్ ట్రూడో, కార్నీ ప్రభుత్వాల్లో నూతన ఆవిష్కరణలు, శాస్త్రసాంకేతిక శాఖ, జాతీయ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఒంటారియోలోని ఓక్‌విల్లేకి చెందిన అనిత... తమిళ్, పంజాబీ మూలాలు ఉన్న భారతీయ మహిళ. అనితా ఆనంద్ తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్ కాగా.. ఆమె తల్లి పంజాబ్‌కు చెందినవారు. ఆనంద్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
2019లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎంపీగా గెలిచి ట్రూడో క్యాబినెట్‌లో చోటుదక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజారోగ్య మంత్రిగా కోవిడ్-19 మహమ్మారికాలంలో వ్యాక్సిన్లు, పీపీఈ కిట్ల కొనుగోళ్ల బాధ్యతలు చేపట్టారు. తర్వాత రక్షణ మంత్రిగా ఉక్రెయిన్‌కు సైనిక సహాయ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాన పదవికి రాజీనామా చేసినప్పుడు.. రేసులో అనితా ఆనంద్ పేరు కూడా వినిపించింది. కానీ, ప్రధాని రేసు నుంచి అనిత తనంతట తానుగా వైదొలిగారు.
మనీందర్ సిధూ
మనీందర్ సిధూ (41) బ్రాంప్టన్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిధూ.. అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా ప్రమోషన్ పొందారు. 2019లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన తర్వాత వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. సహజ వనరులు, రవాణా, మౌలిక సదుపాయాల అంశాలపై పార్లమెంటరీ స్థాయి కమిటీలలో పనిచేశారు. 2021లో అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.
రూబీ సహోతా
రూబీ సహోతా (45) నేరాల నియంత్రణ శాఖకు సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమితులయ్యారు. ఆమె బ్రాంప్టన్ నార్త్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాది అయిన సహోతా.. నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకూ ప్రజాస్వామ్య సంస్థల మంత్రిగా, ట్రూడో పాలన చివరి రోజుల్లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.
వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్.. ప్రతీకార చర్య ప్రారంభించిన కెనడా
రణదీప్ సింగ్ సరాయ్
రణదీప్ సింగ్ సరాయ్ (50) బ్రిటిష్ కొలంబియాలోని సరీ సెంటర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమితులయ్యారు. పంజాబీ వలస కుటుంబానికి చెందిన సరాయ్.. వాంకోవర్‌లో జన్మించారు. ఆయన 2015 నుంచి పార్లమెంట్‌కు ఎన్నికవుతూ వస్తున్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే, కార్నీ క్యాబినెట్‌లో చేరిన నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఒంటారియో రాష్ట్రం నుంచే పార్లమెంట్‌కు ఎన్నిక కావడం విశేషం. అనితా ఆనంద్, మనీందర్ సిధూ, రూబీ సహోతా ఒంటారియో రాష్ట్రంలోని స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
![]() |
![]() |