టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక కాలం నెంబర్ వన్ పొజిషన్‌లో నిలిచిన ఆల్‌రౌండర్‌గా జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ టీమ్ 2024లో కూడా స్థానం సంపాదించుకున్న రవీంద్ర జడేజా మరోసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో నిలిచాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 1151 రోజులుగా రవీంద్ర జడేజానే నెం 1 ఆల్‌రౌండర్‌గా ఉండటం విశేషం.
గత కొన్నేళ్లుగా టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజానే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ మధ్యలో ఒకసారి జడేజాని పక్కకు నెట్టి వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చాడు. అయితే, కొద్ది నెలల్లోనే రవీంద్ర జడేజా మళ్లీ ఫస్ట్ ప్లేస్‌ను అందుకున్నాడు. మార్చి 2022 నుంచి మళ్లీ ఇప్పటి వరకు నెం 1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజానే కొనసాగుతుండటం విశేషం.
జాక్ కల్లిస్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ వంటి మాజీ లెజెండ్స్ కూడా నెంబర్ టెస్టు ఆల్‌రౌండర్‌గా కొనసాగినప్పటికీ జడేజా అంతకాలం నెం 1 పొజిషన్‌లో లేరు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా 400 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కూర్చున్నాడు. జడేజా తర్వాత స్థానంలో 327 పాయింట్లతో మెహదీ హసన్ మిరాజ్ నిలిచాడు. మార్కో యాన్సన్ 294 పాయింట్లతో మూడు, పాట్ కమిన్స్ 271 పాయింట్లతో నాలుగు, షకీబ్ అల్ హసన్ 253 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
36 సంవత్సరాల రవీంద్ర జడేజా తన కెరీర్‌లో ఇప్పటి వరకు 80 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2012 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న జడేజా 118 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 3370 పరుగులు చేశాడు. 150 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 323 వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు పది వికెట్లు పడగొట్టగా, 15 సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు.
![]() |
![]() |