పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ కు తీవ్ర నష్టం చేకూర్చింది. భారత్‌పై దాడులు చేయడం సంగతి అటుంచితే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన దాడులను పసిగట్టడం, వాటిని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు, ఉగ్రవాద శిబిరాలు సహా కీలక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్ దాడులు గుర్తుకు వస్తేనే పాకిస్తాన్‌కు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోయింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్లు, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా తేలిపోవడంతో.. పాక్ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి చేసే దాడులను అడ్డుకోవాలన్నా.. భారత్‌పై దాడులు చేయాలన్నా.. అత్యాధునిక ఆయుధాలు కావాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే చైనా ఆయుధాలను కాకుండా.. జర్మనీ నుంచి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భారత్ చేసిన దాడులను అడ్డుకోలేకపోవడంతో.. జర్మనీకి చెందిన అధునాతన ఐరిస్-టి-ఎస్ఎల్ఎమ్ (IRIS-T-SLM) వ్యవస్థను కొనుగోలు చేయాలని ఇప్పుడు పాక్ యోచిస్తోంది. అయితే భారత రక్షణ ప్రాజెక్టుల్లో జర్మనీ సంస్థకు కీలక భాగస్వామ్యం ఉండటం.. ప్రస్తుతం అడుక్కుతినే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం ఈ కొనుగోలుకు అడ్డంకులుగా మారనున్నాయి. తమ వైమానిక స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొనగా.. భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే తాము తట్టుకోలేమని ముందుగానే గ్రహించారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మోస్ క్షిపణులు సృష్టించే విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది.
ఇటీవల భారత్ ప్రయోగించిన డ్రోన్, క్షిపణి దాడులను చైనా రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేక బిక్కమొహం వేశాయి. పాకిస్తాన్ చెబుతున్నట్లు ఒకవేళ భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించినా.. వాటిని ఎదిరించే సత్తా హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 రక్షణ వ్యవస్థలకు లేనట్లు మొన్ననే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే దీనికి కచ్చితమైన పరిష్కారాన్ని కనుగొనాలని పాక్ నిర్ణయించుకుంది. ఇందుకోసం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిశీలిస్తోంది. గత 3 ఏళ్లుగా రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను.. తాము సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ఐరిస్-టి-ఎస్‌ఎల్‌ఎమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను జర్మనీ నుంచి ఉక్రెయిన్ కొనుగోలు చేసింది.
డీల్ డిఫెన్స్ సంస్థ తయారుచేసిన ఈ ఐరిస్-టి-ఎస్‌ఎల్‌ఎమ్ రక్షణ వ్యవస్థ.. రష్యాకు చెందిన పీ-800 ఆనిక్స్ మిసైళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్షిపణులకు భారత్ రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులకు దగ్గరి పోలికలు ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐరిస్-టి-ఎస్‌ఎల్‌ఎమ్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసేందుకు పాక్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం పాకిస్తాన్‌కు అంత సులువేం కాదు. డీల్ డిఫెన్స్ సంస్థలో భాగస్వామ్యం ఉన్న థైసెన్‌క్రప్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ భారత్‌లోని వివిధ రక్షణ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తోంది.
మరోవైపు.. ఇప్పటికే రక్షణ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారని పాకిస్తాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో ఐఎంఎఫ్ నుంచి 1 బిలియన్ డాలర్లు.. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి మరో 800 మిలియన్ డాలర్లను పాకిస్తాన్ రుణంగా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో అంత భారీ మొత్తాన్ని చెల్లించి జర్మనీ నుంచి పాక్ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ పక్కనబెట్టినా.. చైనాకు వ్యతిరేకంగా జర్మనీ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు మద్దతుగా ఉన్న చైనా కూడా పాక్‌కు వ్యతిరేకం అయ్యే సూచనలు ఉన్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa